ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు పర్యటనలో అన్నీ అనుకున్న ప్రకారమే జరిగినా… ములుగులో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు, జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయటం చెప్పుకోదగ్గ అంశమే. ఆదివాసి యూనివర్సిటీ ఏపిలో ఇప్పటికే ప్రారంభం కాగా తెలంగాణలో ఏర్పాటు చేయకపోవటం విమర్శలకు దారి తీసింది. ఎట్టకేలకు ఈ రెండు అంశాలు కొలిక్కి వచ్చాయి.
గిరిజన విశ్వవిద్యాలయంపై భేదాభిప్రాయాలు ఉన్నా అంతగా రాజకీయాంశం కాలేదు. పసుపు బోర్డు అంశం 2014, 2019 ఎన్నికల్లో ప్రధానంశంగా మారింది. 2019లో నిజామాబాద్ నుంచి 178 మంది పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేశారు. బోర్డు తీసుకొచ్చే బాధ్యత తనదే అన్న ధర్మపురి అరవింద్ ఆ హామీ నెరవేర్చలేదని ఆయన ఇంటి ముందు పసుపు పోసి రైతులు నిరసన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇదే అస్త్రంగా నిజామాబాద్ ఎంపిని ఇరుకున పెట్టాలని…బీ.ఆర్.ఎస్ నాయకులు సిద్దం అయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో బోర్డు కోసం ఉద్యమాలు చేసినా… తెలంగాణ ఏర్పడ్డాక డిమాండ్ తీవ్రం అయింది. తాను సాధించుకు వస్తానని సిఎం కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చి 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపిగా గెలిచినా సాధించలేక పోయారు. చివరకు ఈ ప్రాంత పసుపు కొనుగోలు చేసేలా పతంజలి సంస్థతో స్థానిక రైతాంగానికి మధ్య ఒప్పందం కుదిర్చారు. 2019 ఎన్నికల్లో కవితపై విజయం సాధించిన ధర్మపురి అరవిందుడికి పసుపు బోర్డు సాధించటం గుదిబండగా మారింది. తాజాగా ప్రధానమంత్రి ప్రకటనతో కమలం శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.
ఉత్తర తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పసుపు సాగు అధికం. రాష్ట్రంలో 90 శాతం ఉత్పత్తి ఈ జిల్లాల నుంచే వస్తుంది. దేశంలో నాణ్యమైన పసుపు(కుర్కుమిన్)ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. జగిత్యాల, ధర్మపురి, వేములవాడ, కోరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ నియోజకవర్గాలు పసుపుకు పెట్టింది పేరు.
ప్రధాని మోడీ అక్టోబర్ రెండున నిజామాబాద్ పర్యటనలో పసుపు బోర్డు ప్రకటిస్తారనుకున్నారు. రెండు రోజుల ముందే ప్రకటించటం వ్యూహాత్మకమే. ప్రధాని నిజామాబాద్ పర్యటన సజావుగా సాగేందుకు ఈ ప్రకటన తోడ్పడుతుంది.
బీ.ఆర్.ఎస్ – బిజెపి పార్టీలు మొదటి నుంచి ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో కనిపించటం లేదని మోర్తాడ్ మండలం వెలగటూర్ రైతులు మండిపడుతున్నారు. గతంలో పసుపు బోర్డు అని చెప్పి సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకువచ్చారని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020 ఫిబ్రవరిలో దీనిపై అప్పటి కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటన వివాదాస్పదమైంది.
బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారో ప్రధాని ప్రకటించలేదు. దానిపై సస్పెన్స్ నెలకొంది. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ పర్యటనలో దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందే పసుపు బోర్డు కార్యాచరణ ఆరంభమై… అమలులోకి వస్తే బిజెపి నేతలు రాబోయే ఎన్నికల్లో ధైర్యంగా ప్రచారానికి వెళ్ళగలుగుతారు.