ఖమ్మంలో ఓ సామాజిక వర్గం తనపై దాడికి ప్రయత్నించిందని, గతంలో వంగవీటి రంగాను కిరాతకంగా హత్య చేసిన వారు, ముద్రగడను అంతం చేయాలని చూసిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఓ వివాహ నిశ్చితార్ధ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి నిన్న రాత్రి ఖమ్మం చేరుకున్నారు. నేటి ఉదయం హోటల్ నుంచి బైటికి రాగానే కొంతమంది వ్యక్తులు ఆయన కాన్వాయ్ పై కర్రలతో దాడికి ప్రయత్నించి, బూతులు తిడుతూ అంబటి వైపు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి ఈ ఘటనపై స్పందించారు.
తనపై దాడికి తీవ్రంగా ప్రయత్నిస్తే అంబటికి నిరసన సెగ అంటూ కొన్ని మీడియా సంస్థలు రాయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ దుశ్చర్య తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ ఘటనకు పోలీసులు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకుంటే అందరూ ఒకే సామాజిక వర్గం వారని వెల్లడించారు. ఇది నిరసన కాదని కేవలం డబ్బు మదంతో, కులోన్మాదంతోనే వారు ఈ ఘటనకు పాల్పడ్డారని అంబటి ధ్వజమెత్తారు. గతంలో ఇదే కులం వారు నిర్వహించుకున్న కార్తీక వన సమారాధనలో .. అంబటిని అంతం చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఒక వ్యక్తి బహిరంగంగా మాట్లాడారని గుర్తు చేశారు.
మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే ఈ రకంగా దాడులకు పాల్పడ్డారని, ఇలా దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్నటి రోజుల తాను ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగిందని, నేటి ఘటన చూసిన తర్వాత అది కూడా కావాలని చేసిందేమోననే అనుమానం కలుగుతోందని అంబటి వ్యాఖ్యానించారు.