Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో టిడిపి ఔట్!

తెలంగాణలో టిడిపి ఔట్!

Only AP: “ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో మనుగడ సాధించడం కష్టం” తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు నాడు చేసిన వ్యాఖ్యలివి. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో  పోటీ చేయబోవడం లేదంటూ తెలుగుదేశం అధికారికంగా ప్రకటించిన తరువాత నాటి తుమ్మల మాటలు నిజమేనని రుజువవుతోంది.

 హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా  నటరత్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో లో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టారు. 2014  రాష్ట్ర విభజన నాటికి మొత్తం 32 ఏళ్ళలో 16 ఏళ్ళపాటు టిడిపి ఉమ్మడి ఏపీని పాలించింది.  విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం… తెలంగాణాలో 15  సీట్లు గెల్చుకొని, మరో 17 సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే 10 సీట్లు గెల్చుకోగా, ఖమ్మం-1, మహబూబ్  నగర్-2; వరంగల్-2 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రమే మూడు సీట్లు గెల్చుకుని, అదే జిల్లాలోని మరో రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచింది.

తెలుగు ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని, తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ మకాం వేసి పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నా…. ఓటుకు నోటు కేసు తదనంతర  పరిణామాల్లో ఆయన తన మకాం ఏపీకి మార్చాల్సి వచ్చింది. ఇక్కడ అధికారంలోకి ఉన్నారు కాబట్టి  కొంతమేర అక్కడ కూడా పార్టీని క్రియాశీలకంగా ఉంచగలిగారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్ లో చేరిన తరువాత తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. కానీ టిడిపి మాత్రం జిహెచ్ఎంసి, ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినా ఉనికి చాటుకోలేకపోయింది.

దేశంలో  కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలతో పాటు తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీ హోదాతో ఉన్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా అధికారం కైవసం చేసుకొని సత్తా చాటినా ఇంకా జాతీయ హోదాకు దూరంగానే ఉంది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన టిడిపి కేవలం రెండు సీట్లకే పరిమితమైంది.  ఈ పార్టీతో కలిసి పోటీ చేసిన పాపానికి కాంగ్రెస్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోసారి తెలంగాణపై ఆధిపత్యానికి చంద్రబాబు యత్నిస్తున్నాడంటూ కేసిఆర్ చేసిన ప్రచారం ప్రజలపై బాగా ప్రభావం చూపింది. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో బాబు ఘోర పరాజయం చవి చూశారు. ఈ స్థాయి ఓటమి నుంచి తేరుకోవడానికి సమయం పట్టడం, కోవిడ్ లాంటి కారణాలతో రెండున్నరేళ్ళ పాటు స్తబ్దుగా ఉన్న బాబు…. మెల్లగా ఏపీలో పార్టీని గాడిలో పెట్టడంపై దృష్టి సారించారు. కానీ తెలంగాణలో మాత్రం అది సాధ్యపడలేదు. బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించి  కేడర్ ను కొంత యాక్టివ్ చేయగలిగినా అది నామమాత్రంగానే మిగిలిపోయింది.

తాజా పరిస్థితుల్లో….  స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తాము ఎక్కువ దృష్టి సారించలేమని, అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. బిజెపి పెద్దల ఒత్తిడి మేరకు టిడిపి ఈ నిర్ణయానికి వచ్చిందని, బిజెపి-జనసేన-టిడిపి కూటమి తెలంగాణలో బరిలోకి దిగాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు కాబట్టి అసలు టిడిపిని పోటీలో లేకుండా చేయడంలో బిజెపి సక్సెస్స్ అయ్యిందని అంటున్నారు.

అయితే బాబు అరెస్ట్ లో బిజెపి పాత్ర కూడా బలంగా ఉందని నమ్ముతోన్న  తెలుగుదేశం శ్రేణులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపిచేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల్లో ఉన్న టిడిపి ఇక ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానుంది.  తెలంగాణాలోని  కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బలమైన కేడర్ ఉన్న టిడిపికి ఈ తాజా నిర్ణయం అశనిపాతం కానుంది. కీలకమైన ఎన్నికల్లో తప్పుకోవడం ద్వారా ఇకపై తెలంగాణ తమ కార్యక్షేత్రం కాదన్న సంకేతాలను ఆ పార్టీ స్పష్టంగా పంపినట్లయింది. ఇక ఆ ప్రాంతంలో ఈ పార్టీ కోలుకునే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు.  హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పన, ఐటి అభివృద్ధి లాంటి అంశాల్లో బాబుకు ఎంతో కొంత ఆదరణ ఉన్నా అది ఎక్కువ కాలం కొనసాగలేదు.

అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా, హైదరాబాద్ గడ్డపై పురుడు పోసుకున్న టిడిపి ఆ ప్రాంతంలో కనుమరుగు కానుండడం కాలమహిమ…

RELATED ARTICLES

Most Popular

న్యూస్