Saturday, November 23, 2024
HomeTrending NewsCast Politics -1: తెలంగాణ కుల రాజకీయాలు

Cast Politics -1: తెలంగాణ కుల రాజకీయాలు

తెలంగాణ ఎన్నికలు క్రమంగా రెండు, మూడు కులాల గేం షోగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు మద్దతుగా వెలమ వర్గం ఉంటే… కాంగ్రెస్ వైపు రెడ్డి కులస్తులు ఏకం అవుతున్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగంగా కనిపించకపోయినా రెండు కులాల మధ్య పోరు సాగుతోందని సమాచారం. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ హయంలో సిఎం కెసిఆర్ సామాజిక వర్గానికి చెందిన అధికారులు, నేతలు, కాంట్రాక్టర్లు లబ్ది పొందారని, వారు కోరుకున్న చోట పోస్టింగ్లు లభించాయని, బిల్లులు క్లియర్ చేసుకున్నారని వార్తలు ఉన్నాయి.

ఈ వర్గాల నేతలు ఏ పార్టీలో ఉన్నా అభ్యర్థి తమ కులమైతే పార్టీ గీర్టీ జాన్తా నై..  తమ వారికే సహకరిస్తారని నానుడి ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి పటిష్టంగా ఉన్నా కుల సమీకరణాలు ఆ పార్టీ అభ్యర్థికి కొంత తలనొప్పిగా పరిణమించాయి.

ఉత్తర తెలంగాణలో ప్రాబల్యం కలిగిన వెలమ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ఆర్థికంగా పురోగమించిందని విపక్షాలు  చాలా సందర్భాల్లో ఆరోపించాయి. గతంలో నక్సల్స్ బెదిరింపులతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన దొరలు…వివిధ రకాల వ్యాపారాలు చేపట్టి నగరాల్లో స్థిరపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ పరపతి కొనసాగించినా.. తెలంగాణ వచ్చాక వారి దశ మారిందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వారు ఐక్యం అయ్యారని అంటున్నారు.

రాజధానిలో పోలీసు విభాగం తీసుకుంటే కీలకమైన బాధ్యతల్లో కెసిఆర్ సామాజిక వర్గం వారు ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వహించారనే పేరుంది. ఆ తర్వాతి స్థానంలో రెడ్డి కులస్తులు ఉన్నారు. ఈ రెండు కులాలు వదిలేసిన, పనికిరాని స్థానాలు ఇతరులకు లభిస్తాయని, పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలు కూడా ఈ వైరుధ్యాలకు అతీతం కాదని అంటున్నారు.

వైద్య రంగం విషయానికి వస్తే ఓ ప్రముఖ ఆస్పత్రి తెలంగాణ వచ్చాక ఓ వెలుగు వెలుగుతోందని సమాచారం. ఆ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల అవుతాయట. కరోనా సమయంలో ఆ ఆస్పత్రికి ఎదురు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో గుంపులో గోవిందం మాదిరిగా ఉన్న ఆ వైద్య సంస్థకు ప్రత్యేక రాష్ట్రంలో చేయూత లభించగా రాకెట్ వేగంతో పురోగమించిందని అంటారు.

SC, ST నియోజకవర్గాల్లో రెండు కులాల వారు చెప్పినదే వేదం. వీళ్ళ మద్దతు లేకుంటే అభ్యర్థుల గెలుపు అసాధ్యం. వాళ్ళు ఎవరికీ మద్దతు ఇస్తే వారికే టికెట్టు..గెలుపు ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది.. సూర్యాపేట టికెట్ పై ఆధారపడి నిర్ణయం జరిగింది. అద్దంకి దయాకర్ సమర్థుడైనా కోమటిరెడ్డి అనుచరుడు మందుల సామేలుకు దాకింది. ఆలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఇందుకు భిన్నం కాదు.

కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్డిలదే పైచేయిగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు ఢిల్లీ నాయకత్వం వీరి వెంటే ఉంది.  టిటిడిపి  మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ 2018 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తే అన్నీ తానే చూసుకుంటానని రాహుల్ కు చెప్పగా అదికుదరదని… కష్టమైనా నష్టమైనా తెలంగాణలో రెడ్డిలకే పిసిసి అధ్యక్ష పదవి ఇస్తామని యువనేత చెప్పారట. అందుకు తగ్గట్టుగానే ఈ దఫా రెడ్డిలకు అత్యధికంగా స్థానాలు కేటాయించారు.

బిజెపిలో విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో రెండు కులాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాంతాల వారిగా ఒక దగ్గర వారు..మరో ప్రాంతంలో వీరని జాగీర్లు పంచుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తర తెలంగాణలో వెలమ వర్గానికి ప్రాధాన్యం, దక్షిణ తెలంగాణలో రెడ్డిలది పైచేయి కాగా రాజధాని హైదరాబాద్ ఇద్దరి సంగమం మాదిరి ఉంటుంది. అయితే క్షేత్ర స్థాయి నాయకుల్లో అధికంగా రెడ్దీలే ఉంటారు.

తెలంగాణలో ఏ జిల్లా పరిశీలించినా రెండు కులాల ప్రమేయం లేకుండా ఇతరులు రాజకీయంగా నిలబడలేని, ఎదగలేని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఇతర వర్గాల నుంచి నాయకత్వం వచ్చినా చిత్తశుద్దితో వెనుకబడిన వారి అభివృద్ధి కోసం పనిచేసిన నేతలు తక్కువనే చెప్పాలి. బలహీన వర్గాలు అధికారంలో ఉన్నా విధాన నిర్ణయాలు, అమలులో వారికి పరిమితులు ఉంటాయి.

-దేశవేని భాస్కర్

Also Read: Adivasi: తెలంగాణ రాజకీయాలు ఆదివాసీల అసంతృప్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్