The Seven Ramparts: విజయనగర రాజ్యం ఉత్థాన-పతనాలు; వైభవం-దుర్గతి దగ్గర మొదలుపెడితే తప్ప లేపాక్షి చరిత్ర సరిగ్గా అర్థం కాదు. 1336లో పురుడు పోసుకున్న విజయనగర మహా సామ్రాజ్యం 1565 దాకా దేదీప్యమానంగా వెలిగి…తళ్లికోట యుద్ధం తరువాత కొడిగొట్టింది. కట్టుబట్టలతో రాజధాని హంపీని వదిలి… పెనుగొండకు… అటునుండి చంద్రగిరికి…అక్కడినుండి శ్రీరంగపట్నం/చెంగల్ పేట్ కు విజయనగర ప్రభువులు మారినా…1646 వరకు ఒకరి తరువాత ఒకరు ఉన్నా…ఉన్నారంటే ఉన్నారు- లేరంటే లేరు అన్నట్లు అనామకులుగా మిగిలిపోయారు.
విజయనగర పతనావస్థను వివరిస్తూ ఐధాత్రి గతంలో ప్రచురించిన కథనం లింక్ ఇది:-
1471 జనవరి 17న జన్మించిన శ్రీకృష్ణదేవరాయలు 1509 ఫిబ్రవరి 4 న విజయనగర చక్రవర్తిగా పట్టాభిషికుడయ్యాడు. 1529 అక్టోబర్ 17 న అనారోగ్యంతో తుదిశ్వాస వదిలాడు. (ఇరవై ఏళ్ల వయసులో పట్టాభిషిక్తుడయ్యాడని చరిత్రకారులు కొన్ని ఆధారాలను వెలికి తీశారు. ఆ లెక్కప్రకారమైతే 1471 జనన సంవత్సరం తప్పు కావాలి. కర్ణాటకలోని తుముకూరులో దొరికిన శిలాశాసనం ప్రకారం కృష్ణరాయలు చనిపోయిన తేదీ కచ్చితంగా తెలిసినా…పుట్టిన సంవత్సరం, తేదీ మీద ఇప్పటిదాకా స్పష్టత లేదు. చనిపోవడానికి ముందే ఎనిమిదేళ్ల కొడుకును చక్రవర్తిని చేసి…తను ప్రధానిగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. శక్తియుక్తులు లేని తమ్ముళ్ల చేతిలో పడితే విజయనగరం భద్రంగా ఉండదని ఊహించి ఈ పని చేసి ఉండాలి. ఆ కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. కొడుకు మరణం కృష్ణరాయలును కుంగదీసింది. ఆయన భయపడినట్లే ఆయనతోనే విజయనగర ప్రభ కూడా పోయింది)
దీనికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ గతంలో ఐధాత్రి ప్రచురించిన కథనం లింక్ ఇది:-
ఆయన పాలనా కాలం అక్షరాలా ఇరవై ఏళ్లు. కానీ…వేల ఏళ్లకు తరగని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. బతికింది 58 ఏళ్ళే. కానీ…కలకాలం తరిగిపోని యశస్సును సంపాదించుకున్నాడు. ఆయన మరణానంతరం ఆయన తమ్ముడు అచ్యుతదేవరాయలు 1529లో చక్రవర్తి అయ్యాడు. 1542 వరకు విజయనగరాన్ని పాలించాడు.
దక్షిణాపథం దాటి ఆ చంద్రతారార్కంగా వెలిగిన కృష్ణరాయ కిరీటం నెత్తిన పెట్టుకున్నప్పుడు సహజంగా అచ్యుతదేవరాయలమీద ఒత్తిడి ఉంటుంది. కృష్ణరాయలతో పోలిక ఉంటుంది. అతనిలా పనిచేసి పేరు తెచ్చుకోవాలన్న సత్సంకల్పం కూడా ఉండి ఉంటుంది. కానీ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు.
అచ్యుతరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా పనిచేస్తున్న విరుపణ్ణ పుట్టి పెరిగింది లేపాక్షిలో. తండ్రి లేపాక్షి నందిలక్కు సెట్టి. తల్లి ముద్దమ. తమ్ముళ్లు వీరపనాయకుడు, వీరప్పన్నయ్య. అచ్యుతరాయలకన్నా ముందే విరుపణ్ణ విజయనగరం కొలువులో “ద్వార కాపలాదారు”; “తలవరుడు” ఉద్యోగాలు చేసి…అచ్యుతరాయల కాలంలో పదోన్నతి పొందాడు. 1541-42 సంవత్సరాల్లో చిత్తూరు జిల్లా నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని విరుపణ్ణ నిర్మించినట్లు శాసనాధారం ఉంది. తిరుమల వెంకన్నకు, శ్రీకాళహస్తికి, లేపాక్షి ఆలయాలకు విరుపణ్ణ అనేక దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. దీనినిబట్టి కోశాధికారి అంటే కేవలం గల్లాపెట్టె లెక్కలు చూసుకునే ఉద్యోగం కాదని అర్థమవుతోంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా అప్పటి కోశాధికారికి భాగం ఉంది. నిజానికి కోశాధికారి తరువాత విరుపణ్ణ మరో పదోన్నతి కూడా పొందాడని చరిత్రకారుల అంచనా.
ఎక్కడెక్కడో కాళహస్తి, తిరుమలలోనే ఆలయాలను నిర్మించిన విరుపణ్ణ తను పుట్టిన ఊరు లేపాక్షిలో ఆలయం కట్టకుండా ఎందుకుంటాడు? 1530 ప్రాంతాల్లో మొదలైన లేపాక్షి ఆలయ నిర్మాణం దాదాపు 12 ఏళ్లపాటు సాగింది. 1542 లో అచ్యుతరాయల మరణానంతరం అళియరామరాయలు దగ్గర కూడా విరుపణ్ణ పనిచేసినట్లు ఆధారాలున్నాయి. అచ్యుతరాయలు విరుపణ్ణ కళ్లు ఊడబెరికించి… శిక్షిస్తే… వెనువెంటనే అళియరామరాయలు గుడ్డివాడిని పాలనలో సాయం చేయమంటూ నెత్తిన పెట్టుకుంటాడా? కాబట్టి కళ్లు పెరుక్కున్న కథ అక్షరాలా కల్పితమే.
విరుపణ్ణ, ఆయన తమ్ముడు వీరణ్ణ(వీరపనాయకుడు) ఇద్దరూ వీరభద్రుడికి మహా భక్తులు. అచ్యుతరాయల కోరికమేరకే లేపాక్షి ఆలయాన్ని వారు ఏడు ప్రాకారాలతో ఒక మహా నగరంగా నిర్మించారు. అందులో బయటి నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలసిపోయాయి. మూడు ప్రాకారాల గుడి మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఏడు ప్రాకారాల లెక్క ప్రకారం నంది కూడా ఆలయం పరిధిలోకే వస్తుంది.
గుడిలో శివపార్వతుల కల్యాణమంటపం కట్టేనాటికి విజయనగర రాజ్యం యుద్ధాలు, గొడవలు, ఆర్థిక సమస్యల్లో ఉంది. అప్పుడు ఆగిన ఆలయం అలాగే ఉండిపోయింది. 1646 తరువాత గుళ్లో నిత్య ధూప దీప నైవేద్యాలు కూడా లేక దాదాపు 250 ఏళ్లపాటు ఆలయం తనను తానే మరచిపోయింది. 1925- 50 ల మధ్య కల్లూరు సుబ్బారావు చొరవవల్ల మట్టి దిబ్బలో నుండి మాణిక్యాల శిల్పసోయగాల మహాలయం బయటపడింది.
మొదటి ప్రాకారంలో గ్రామోత్సవాలకు ప్రత్యేకంగా సోమవార మంటపం ఉంది. రెండో ప్రాకారంలో శిల్పుల వంటశాల, ఏడుపడగల పెద్ద నాగలింగం, పక్కన రాతి గుండు మీద శ్రీకాళహస్తి కథా శిల్పాలు, పెద్ద గణపతి విగ్రహాలున్నాయి. వీటి పక్కనే మధ్యలో ఆగిపోయిన శివపార్వతుల కల్యాణ మంటపం ఉంది. దీని పక్కన ఉయ్యాల మండపం ఉంది.
ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ముఖ మండపం(నాట్యమండపం) అర్ధ ముఖ మండపం, ఆస్థాన మండపం చివర గర్భగుళ్ల సముదాయమైన గర్భగుడి ఉంటాయి.
శిల్పం, చిత్రం, పురాణ కథల సమాహారమైన లేపాక్షిలో ఒక్కో రాతిది ఒక్కో కథ. రాళ్లు నోళ్లు విప్పి తమ కథను తామే చెప్పుకునే లేపాక్షి రాళ్లను కదిలిస్తే…బండరాతి గుండెలు కూడా కరిగి నీరవ్వాల్సిందే.
(శ్రీకృష్ణ దేవరాయల జననం, పట్టాభిషేకం, మరణ సంవత్సరాలు… తేదీలకు సంబంధించి వివాదాలను పరిష్కరించి…. కచ్చితమైన తేదీలను అనేక ఆధారాలతో నిరూపించిన ప్రఖ్యాత చారిత్రిక పరిశోధకుడు నేలటూరి వెంకట రమణయ్య, కొటికలపూడి యజ్ఞేశ్వర శర్మ గారి నరసింహ శర్మ, గ్రంథాలయోద్యమ పితామహుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వ్యాసాలను ప్రామాణికంగా పరిగణించి ఎమ్మెస్కో ప్రచురించిన ‘శ్రీ కృష్ణదేవరాయ వైభవం’ ఈ వ్యాసానికి ఆధారం)
రేపు:- అదిగో లేపాక్షి-5
“రాళ్ల నాట్యానికి వేలాడిన స్తంభం”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018