Saturday, July 27, 2024

హంపీ కథ-8

Planted Stories:
తిమ్మరుసు కనుగుడ్ల కథ
విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండెపగిలి ఏడ్చి…ఏడ్చి…కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి పెనుగొండలో చీకటి గృహంలో బందీగా పెట్టాడు.

కొంతకాలానికి కొడుకు మృతికి తిమ్మరుసు కారణం కాదని తెలుసుకుని...కృష్ణరాయలు అర్జంటుగా గుర్రమెక్కి హంపీనుండి ఆగకుండా పెనుగొండ వెళితే…కనులు లేని నన్ను నీ కళ్లు చూడలేవు రాయా! వెళ్లు…అని నిర్మొహమాటంగా చెప్పాడు అప్పాజీ. ఆ బాధతో కృష్ణరాయలు హంపీలో పోయాడు. కనులు చూడని కారు చీకట్లలో పెనుగొండ బందిఖానాలో తిమ్మరుసు కూడా పోయాడు.

ఈ కథ ఎలా పుట్టిందో? ఎందుకు పుట్టిందో? కానీ…అయిదు వందల ఏళ్లుగా కథలు కథలుగా అల్లుకుంటూనే ఉంది. తను బతికి ఉండగానే ఎనిమిదేళ్ల (ఒకటిన్నర సంవత్సరం వయసు అని మరొక శాసనంలో ఉంది) కొడుకును కృష్ణరాయలు విజయనగర చక్రవర్తిగా ప్రకటించి, తను సలహాలిస్తూ పర్యవేక్షించే ప్రధాని పదవిలో ఉన్నది నిజం. ఆ పిల్లాడు అనారోగ్యంతో మరణించినది నిజం. ఆ దిగులుతో అనారోగ్యం పాలై కృష్ణరాయలు మరణించినది నిజం. కృష్ణరాయల కొడుకు మీద తిమ్మరుసు ప్రయోగించిన విషం…కనుగుడ్లు పెరకడం…కథంతా జరిగింది కృష్ణరాయల పెనుగొండ వేసవి విడిదిలో అని ఇప్పటికీ పెనుగొండలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

కృష్ణరాయల మరణం తరువాత కూడా తిమ్మరుసు విజయనగరం మహా మంత్రిగా పని చేస్తూ…కొన్నేళ్ల తరువాత తిరుమలకు వెళ్లినట్లు తిరుపతిలో దొరికిన ఒక శాసనం స్పష్టం చేస్తోంది. అవసాన దశలో తిమ్మరుసు ఆర్థికంగా దెబ్బ తిన్నట్లు కూడా ఆ శాసనాన్ని బట్టి అర్థమవుతుంది.

తన తరువాత తన తమ్ముడు లేదా తమ్ముడి పిల్లలు చక్రవర్తులయితే ఇంటిపోరుతో విజయనగరం కూలిపోతుందన్న భయంతోనే…సదుద్దేశంతోనే…కృష్ణరాయలు అంత పసిపిల్లాడయిన కొడుకును సింహాసనం మీద కూర్చోబెట్టాడే కానీ ఇందులో ఇంకో కారణమేదీ కనిపించడం లేదు.

అనేక అడ్డంకులను దాటుతూ తనను చక్రవర్తిని చేసిన తిమ్మరుసుకు చెప్పకుండా కృష్ణరాయలు కొడుకును చక్రవర్తిగా ప్రకటించి ఉంటాడని మనం అనుకుంటే దానికి వారేమి చేయగలరు? తిమ్మరుసు లేకపోతే కృష్ణరాయలు లేడు. కృష్ణరాయలు లేకపోతే తిమ్మరుసు లేడు. అంతే.

కృష్ణరాయల తండ్రికి ఇద్దరు భార్యలు. ఒక శాసనంలో ముగ్గురు భార్యలు అని కూడా ఉంది. ఇద్దరో, ముగ్గురో తేలక చరిత్రకారులు చేతులెత్తేశారు. కృష్ణరాయలును చంపి తన కొడుకుకు అడ్డు తొలగించాలని సవతి తల్లి ఆదేశించినప్పుడు మేక కళ్లు తెచ్చి చూపించి…కృష్ణరాయల కళ్లు పీకేశాము…అని రుజువుగా వాటిని చూపించి…రాయలును బతికించినవాడు తిమ్మరుసు. అలాంటి తిమ్మరుసు సాక్షాత్తు రాయల కొడుకును చంపడం ఏమిటి? ప్రతిగా రాయలు తిమ్మరుసు కళ్లు పీకేయించడం ఏమిటి? ఈ కనుగుడ్ల కథ అల్లికలో అన్నీ లొసుగులే.

కృష్ణదేవరాయలు శిక్షించి కళ్లు పెరికించిన తిమ్మరుసును తరువాత విజయనగరం మహా మంత్రిగా పెట్టుకుందా? కళ్లులేని గుడ్డివాడయినా కూర్చుని గుడ్డి పాలన చేయమని గుడ్డిగా అడిగిందా?

ఇంకా లోతుగా వెళితే ఇదో గ్రంథమవుతుంది. నేను చదివిన విజయనగరం చరిత్ర ప్రకారం-
1. తిమ్మరుసు కృష్ణదేవరాయల కొడుకును చంపించలేదు.
2. తిమ్మరుసు కనుగుడ్లను కృష్ణరాయలు పెరికించలేదు.
3. పెనుగొండలో తిమ్మరుసు సమాధి అని కొందరంటారు. బందిఖానా అని కొందరంటారు. తిమ్మరుసు కులాచారం ప్రకారం శవానికి దహనం జరిగి ఉండాలి కానీ…సమాధి ఉండడానికి వీల్లేదు. చచ్చి బూడిద కాకుండా…సమాధిలో కళ్లు లేని ప్రేతమై అలాగే ఉంటే…ఆ పగ కలకాలం నిలిచి ఉంటుందని చేశారా?
4. కృష్ణరాయలతో పాటు దివికేగలేక దుర్భరంగా బతుకుతున్నట్లు అల్లసాని పెద్దన స్పష్టంగా చెప్పుకున్నాడు. కృష్ణరాయల మరణం తరువాత తిమ్మరుసుది కూడా అలాంటి దీన స్థితే అయి ఉండాలి.
5. నాటకాలు, సినిమాల్లో నాటకీయత కోసం, కథలో అనూహ్యమయిన, గుండె మెలిపెట్టే మలుపులకోసం మధ్యలో ఎవరో తిమ్మరుసు కనుగుడ్ల మీద పడి పెరికి ఉండాలి.
6. రాయలు- తిమ్మరుసు మధ్య అసూయలకు, వైరుధ్యాలకు, శత్రుత్వానికి అవకాశమే లేదు.

కృష్ణరాయలుకు మొహమంతా మచ్చలా?
కృష్ణదేవరాయలు అంత పొడుగూ కాదు. పొట్టీ కాదు. నలుపు రంగు. మొహం నిండా స్ఫోటకపు మచ్చలు అని ఇప్పుడే ఆయన్ను చూసి…మాట్లాడి వచ్చినట్లు చెప్పేవారెవరూ ఆయన్ను చూడనేలేదని నా తీర్మానం. ఆయన అందగాడు. కండలు తిరిగిన యోధుడు. పెదవి మీద చిరునవ్వు చెదరని వాడు. యాభై కిలోమీటర్ల వేగంతో గుర్రం మీద వెళుతూ పక్కన మరో గుర్రం మీదికి ఎగిరి కూర్చోవడం లాంటి విద్యలు అతడికి ఆట. ఒకరోజు పొద్దున్నే గుర్రం మీద పెనుగొండలో బయలుదేరి సాయంత్రం లోపు హంపీలో పూజకు రాయలు వెళ్లినట్లు…అప్పుడు ఆయన పక్కన అదే వేగంతో పరుగెత్తిన గొడుగుపాలుడికి ఆయన బహుమానంగా ఇచ్చిన ఊరే గొడుగుపాలపురం…అదే గోపాలపురం అయ్యిందని ఒక శాసనాన్ని రుజువుగా చూపుతూ తిరుమల రామచంద్ర “హంపీ నుండి హరప్పా దాకా”లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కథ కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల్లో తరతరాలుగా చెప్పుకుంటున్నదే.

Srikrishna Devaraya Kingdom Fact

నెత్తిన ముత్యాలు వేలాడే పట్టు తలపాగాతో అందం పోతపోసిన రాయలు మొహం నిండా మచ్చలు ఎవరికి కనిపించాయో? ఎప్పుడు చూశారో?
ఇంకా నయం! బయటి ప్రపంచానికి తన మచ్చల మొహం చూపించలేక…ఇంట్లో అద్దంలో ఆ మచ్చలనే పదే పదే చూసుకుంటూ కుమిలి కుమిలి చిక్కి శల్యమై చనిపోయాడనలేదు.

ఒక విదేశీ సందర్శకుడు కృష్ణరాయలును కలిసి అన్న మాట ఒకటి రికార్డుల్లో ఉంది.
“హంపీ రాజభవనంలో మేము నలుగురం కృష్ణరాయలును కలవడానికి వెళ్ళాము. చెకింగులు అయ్యాక మమ్మల్ను ఆయనున్న గది ముందు కూర్చోబెట్టారు. బంగారు తాపడంతో ముత్యాలు వేలాడుతున్న దీవాన్ లా ఉన్న వాటి మీద మెత్తటి పరుపులు వేసి ఉన్నాయి. కాసేపటికి పిలుపు వచ్చి లోపలికెళితే…కృష్ణరాయల అందం చూడాలో…అక్కడున్న ఏనుగు దంతాల ఇంటీరియర్ అందం చూడాలో తెలియక తికమక పడ్డాం. అతిథి మర్యాదలు మరచిపోలేనివి. విరూపాక్ష గుడి పక్కన కొండెక్కి చూస్తుంటే వీధుల్లో ఎటు చూసినా సందడే సందడి”

ఇతడికి మచ్చలు కనపడలేదా? లేక నా మచ్చల గురించి మాత్రం బయట ఎక్కడా చెప్పకు అని కృష్ణదేవరాయలు ప్రాధేయపడితే…సరేలే అని అభయమిచ్చి ఉంటాడా?

Srikrishna Devaraya Kingdom Fact

కృష్ణరాయడికి ముగ్గురు భార్యలా?
తిరుమలా దేవి, చిన్నా దేవి కాకుండా కమల లేదా అన్నపూర్ణ పేరుతో కృష్ణరాయలుకు మూడో భార్యను కూడా సృష్టించి పెళ్లి కూడా చేసింది లోకం. దురదృష్టం కొద్దీ విజయనగర శాసనాలేవీ ఈ మూడో భార్యను గుర్తించినట్లు లేవు! ఆయన కూడా ఆముక్తమాల్యదతో పాటు ఇతర సంస్కృత కావ్యాల్లో ఇద్దరు భార్యలను ప్రస్తావించి…మూడో భార్య విషయం చెప్పలేదు. కనపడితే కాలర్ పట్టుకుని అడగండి. గట్టిగా అడిగితే ఒప్పుకోకపోడు!

ఆముక్తమాల్యద పెద్దన రాశాడా?
అల్లసాని పెద్దన రాసి పెట్టిన “ఆముక్తమాల్యద”ను తాను రాసినట్లు కృష్ణరాయలు డబ్బా కొట్టుకున్నాడట! ఇలా అన్న వారిని ఖండ ఖండాలుగా ప్రఖ్యాత పండితుడు చిలుకూరి నారాయణరావు కత్తితో ఖండించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తుళు, తమిళ భాషల్లో అనన్యసామాన్యమయిన పాండిత్యం ఉన్న కృష్ణరాయలు ఆముక్తమాల్యద రాయలేదని అనేవారు ఆయన పుట్టనే లేదని కూడా అనగలరు అన్నారు చిలుకూరి.

నైజాం ప్రభువు బ్రిటీషు వారికి వదిలివేసిన అన్న అర్థంలో దత్త-సీడెడ్ జిల్లాలు అని తలదించుకోవాల్సిన పేరును మార్చి “రాయలసీమ” అని తల ఎత్తుకోగల రాయల స్ఫూర్తితో నామకరణం చేసింది చిలుకూరి వారే. అన్ని భాషలు తెలిసినా తన తల్లి చంద్రగిరి ప్రాంత నాగలాంబ మాట్లాడే “తెలుగు భాష లెస్స” అన్నందుకు రాయలుకు తెలుగు పద్యం రాయడమే రాదన్నది పాడు లోకం. ఇలా అంటారని తెలిసి ఉంటే…ఆముక్తమాల్యద తానే రాసినట్లు, ఎవరూ రాసిపెట్టలేదని హంపీ ఊరి ముందు ఒక శిలాశాసనం కూడా వేయించి ఉండేవాడు కదా!

అష్టదిగ్గజ కవులు లేరా?
అష్టదిగ్గజ కవుల వయసులను బట్టి ఎనిమిది మంది ఏకకాలంలో రాయల కొలువులో లేరని మహా మహా పండితులు అయిదు శతాబ్దాలుగా జుట్లు పట్టుకుని కొట్టుకుంటూనే ఉన్నారు. కృష్ణరాయలు సంగీత, సాహిత్య ప్రదర్శనకు తన రాజభవనం పక్కనే భువనవిజయ సభా మండపం కట్టించినది నిజం. అందులో ఎనిమిది మంది కవులు ఉన్నమాట నిజం.

Srikrishna Devaraya Kingdom Fact

వీధుల్లో వజ్రాలెలా అమ్ముతారు?
అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట…అని పాడుకోవాల్సిందే కానీ…విరూపాక్ష గుడిముందు ఇంటర్నేషనల్ బజార్లో వీధుల్లో వజ్రాలు పోసి ఎందుకమ్ముతారు? విడ్డూరం కాకపోతే! అన్నది మన పెదవి విరుపు. విఠలాలయ అరుగు కింద చైనా, పర్షియా విదేశీ వర్తకులు గుర్రాల్లో వచ్చి ట్రేడింగ్ చేసినట్లు వారి వారి వేషాలు, ముఖ కవళికలతో పాటు శిల్పాల వరుసలో కథనాలు ఉన్నాయి. వజ్రాలతో పాటు ఆ వీధిలో అమ్మని నగలు లేవు…రోమ్ తరువాత ప్రపంచంలో ఇంతటి నగర వైభవం ఇంకెక్కడా లేదు అని కృష్ణదేవరాయలకంటే ముందే హంపీని సందర్శించిన ఇద్దరు, ముగ్గురు విదేశీ పర్యాటకులు చెప్పిన రికార్డులను కూడా తుంగభద్రలో తొక్కేద్దాం. మురుగు కాలువ కంపు మీద మనం పానీ పూరీ ఫాస్ట్ ఫుడ్డు తిన్నట్లే...హంపీ వీధి చివర చీకట్లో గుడ్డి గుర్రం దిగి కృష్ణరాయలు కూడా పాచి ఫుడ్డు తిని…ఇంటికెలా వెళ్లాలో తెలియక మనల్ను అడుగుతున్నాడు అని అనుకోవడంలో మన తృప్తే తృప్తి! ఇప్పటి మన దౌర్భాగ్యాన్నే అప్పటి హంపీకి కూడా అంటగడదామా?

చరిత్రలో కలిసిపోయేవారు కొందరు.
చరిత్రను విస్మరించేవారు కొందరు.
చరిత్రను నిర్మించేవారు కొందరు.

Srikrishna Devaraya Kingdom Fact

విజయనగరానిది విస్మరించడానికి వీల్లేని చరిత్ర.
తుంగభద్రా తీరంలో పడి ఉన్న ప్రతి రాయి గొంతు విప్పి ఆ సముజ్వల చరిత్రను గానం చేస్తూనే ఉంటుంది.
శత్రు మూకల దాడుల్లో శిల్పాల తలలు తెగినా…కోటలు కూలినా…మొండేలు, మొండి గోడలు కూడా సంగీతం, సాహిత్యం, కళలు…మనదయిన ఒకానొక గొప్ప సంస్కృతికి విజయకేతనమయిన విజయనగర దిగ్విజయ గీతాన్ని వినిపిస్తూనే ఉంటాయి…చెవి ఒగ్గి వింటే. కళ్లు తెరిచి చూస్తే. మనసు పెట్టి తిరిగితే.

కళ్లున్నందుకు కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సినది హంపీ.

(ఈ 8 వ్యాసాలకు నేను ఉపయోగించుకున్న పుస్తకాలు; వ్యాసాలు:-
1. శ్రీకృష్ణదేవరాయల వైభవం- ఎమెస్కో ప్రచురణ.
2. హంపీ క్షేత్రం- కొడాలి వేంకట సుబ్బారావు.
3. రాయలనాటి రసికత- రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
4. రాయలనాటి రసికతా జీవనం- పుట్టపర్తి నారాయణాచార్యులు.
5. హంపీ- పుట్టపర్తి నారాయణాచార్యులు
6. పెనుగొండ లక్ష్మి- పుట్టపర్తి నారాయణచార్యులు.
7. శ్రీకృష్ణదేవరాయలు- నేలటూరి వెంకటరమణయ్య
8. విజయనగర సామ్రాజ్యం- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
9. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే- చిలుకూరు నారాయణరావు.

రెఫెరెన్సుల్లో, విషయంలో, రాజుల సంవత్సరాల్లో ఎక్కడయినా పొరపాట్లు దొర్లి ఉంటే తెలియజేయగలరు. సవరించుకుంటాను. అసలే వక్రీకరణకు గురైన హంపీ చరిత్రకు మరింత వక్రీకరణ మంచిది కాదు.

ధాత్రి మహతి యూట్యూబ్ ఛానెల్ కోసం హంపీలో నా వీడియోలకు నా భార్య శోభ కెమెరా వుమన్. ఇన్నేళ్ళుగా నేను చెబుతున్న పద్యాల్లో ఎక్కడేది చెప్పాలో గుర్తు చేస్తూ…నన్ను హంపీ దృశ్యంలో బంధించింది)

హంపీ వైభవం వ్యాసాలు దీనితో సమాప్తం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హంపీ వైభవం-1

Also Read :

హంపీ వైభవం-2

Also Read :

హంపీ వైభవం-3

Also Read :

హంపీ వైభవం-4

Also Read :

హంపీ వైభవం-5

Also Read :

శిథిల హంపి-6

Also Read :

హంపీ వైభవం-7

RELATED ARTICLES

Most Popular

న్యూస్