Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను అని అందుకే మనం అనలేము. మనకు చావు పుట్టుకలు ఉన్నట్లు దేవుళ్లకు కూడా చావు పుట్టుకలను ఆపాదిస్తాం. మనలాగా పుట్టినప్పుడు వారికీ ఈ బాధలు తప్పవేమో!

రావణుడి ఆగడాలతో చస్తున్నాం…అని దేవతలు కంటికి మంటికి ఏకధారగా ఏడిస్తే…విష్ణువు రాముడిగా అవతరించాడు. శివుడు ఆంజనేయస్వామిగా అవతరించాడు. మనిషి, కోతి తప్ప ఇక ఎవరినుండి నాకు ప్రాణహాని లేకుండా వరమివ్వు అని రావణుడు అడిగిన షరతు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. కాబట్టే రాముడు, హనుమ అవతరించారు.

ఎంత దేవుళ్లయినా భూలోకంలో అవతరిస్తే భూలోకం ఫార్మాలిటీస్ ఫాలో కావాల్సిందే. దశరథుడి పుత్రకామేష్టి యాగం తరువాత రాముడు అయోధ్యలో పుట్టాడు అన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. హనుమ ఎక్కడ పుట్టాడన్నదే ఎడతెగని చర్చ.

తిరుమల కొండమీద జపాలి ఆంజనేయస్వామి గుడే హనుమ జన్మస్థానం అని తిరుమల తిరుపతి దేవస్థానం- టి టి డి అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో హంపీకి దగ్గరున్న అంజనాద్రి లేదా హనుమంతహళ్లి హనుమ జన్మస్థలం అని అనాదిగా అక్కడివారు నమ్మి…గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్- త్ర్యంబకేశ్వర్ మధ్యలో అంజనేరి కొండే హనుమ జన్మస్థలం అని మహారాష్ట్ర గట్టి నమ్మకం.

ఇందులో మూడిట్లో ఏదో ఒకటే నిజం కావచ్చు. మూడూ నిజం కావచ్చు. ఇంకా కొన్ని చోట్ల కూడా హనుమ పుట్టి ఉండవచ్చు. ఈ ప్రాంతీయ పట్టుదలల్లో స్థానికుల భక్తిని మెచ్చుకోవాలి. చరిత్ర, పురాణాలు, ఇతర ఆధారాలతో తలబాదుకోవడం దండగ.

మైసూరులో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ “లేపాక్షి స్వప్నదర్శనం” పేరిట బాడాల రామయ్య ఒక పద్య కావ్యం రాశారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ ముందు మాట రాశారు. అందులో విశ్వనాథ వారి మాటలివి.

“లేపాక్షిలో జటాయువు పక్షి రెక్క తెగి పడి ఉండగా…సీత కోసం అన్వేషిస్తున్న రాముడు అటుగా వచ్చి…రక్తమోడుతున్న జటాయువును చూసి…ఓదార్చి…లే! పక్షి! అనడంతో ఈ ఊరికి లేపాక్షి అనే పేరొచ్చింది. స్థానికులు శతాబ్దాలుగా ఈ కథను నమ్మి భక్తితో కొలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం రాముడికి తెలుగు వచ్చినట్లు వాల్మీకి ఎక్కడా చెప్పలేదే? జటాయువు ఏ భాషలో ఏడ్చింది? లాంటి పిచ్చి ప్రశ్నలతో గింజుకోవడం కంటే…మన రాముడు మన తెలుగులోనే మాట్లాడాడు. రామదాసుతో, త్యాగయ్యతో మాట్లాడలేదా? దేవదేవుడికి తెలియని భాష ఏముంటుంది? అని అనుకుంటే ఎంత తాదాత్మ్యంగా ఉంటుంది?”

రాముడు తెలుగులో “లే…పక్షి!” అని ఉంటాడా? లేదా? అని సందేహిస్తున్న వారందరికీ ఇదే సమాధానం.

“మా ఊళ్లో హనుమ పుట్టాడు. ఆ పుట్టిన చోటిది.

వాలి గుహ ఇది.

కిష్కింధ సామ్రాజ్యం ఇక్కడే ఉండేది. సుగ్రీవుడు- రాముడు కలిసిన చోటిది. రామ- లక్ష్మణులు నాలుగు నెలలు తలదాచుకున్న రాతి గుహ ఇది. సీతమ్మ దగ్గరినుండి వచ్చిన హనుమ మాల్యవంత పర్వతం మీద నిరీక్షిస్తున్న రాముడి చేతిలో చూడామణి ఇచ్చిన చోటిది. రుష్యమూక పర్వతం ఇది. మాతంగి మహర్షి ఆశ్రమం ఇది. రాముడికి శబరి పళ్ళిచ్చిన చోటిది” అని యుగయుగాలుగా వారక్కడ గుళ్లు కట్టి పూజిస్తుంటే…మనం ఒప్పుకోకపోతే…మన ఆధారాలను ఒప్పుకోకుండా ఉండడానికి వారికీ అధికారం ఉంటుందని అంగీకరించాల్సి ఉంటుంది. దాని బదులు హనుమ ఎక్కడయినా పుట్టగలడు అనుకుంటే ఉభయతారకం.

హంపీ వ్యాసాలు చదివి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి కూతురు, నా శ్రేయోభిలాషి పుట్టపర్తి నాగపద్మినిగారు విలువైన సమాచారం ఇచ్చారు. ఆమె తండ్రికి తగ్గ తనయ. అనేక రచనలు, అనువాదాలు చేశారు. 1960 లో పుట్టపర్తి నారాయణాచార్యులు హంపీకి వెళ్లి మహర్నవమి దిబ్బ మీద కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారట. ఆయన అంతకుముందే (1929 కి ముందే) అంటే పదిహేనేళ్ల వయసు కూడా దాటకముందే “పెనుగొండ లక్ష్మి” పద్యకావ్యం రాశారు. తరువాత విద్వాన్ పరీక్షలో ఆయన రాసిన ఈ కావ్యమే ఆయనకు పాఠ్యపుస్తకం. నాకు తెలిసినంతవరకు ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇంకే కవికి ఇలా తను రాసిన పుస్తకం తనకు చదువులో పాఠ్య పుస్తకం అయి ఉండదు.

విజయనగర రాజులతో పాటు వారి పోషణలో ఎదిగి పూచిన సాహిత్యాన్ని పుట్టపర్తి అణువణువునా ఆవాహన చేసుకున్నారు. హంపీ గురించి 1960 ప్రాంతాల్లో ఆయన రాసిన 16పేజీల సాధికారికమయిన, సుదీర్ఘ వ్యాసాన్ని నాగపద్మిని గారు నాకు పంపుతూ…నా హంపీ వ్యాస పరంపరలో ప్రస్తావించమన్నారు.

నేను చూసిన హంపీకి వాల్మీకి రామాయణానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్న నాకు పుట్టపర్తి వారి వ్యాసం ఆయుధంలా దొరికింది. అంత పెద్దాయన వివరణ ఉన్నప్పుడు నా అభిప్రాయం ఎందుకు? ఆయన మాటల్లోనే వినండి. చాలా పెద్ద వ్యాసం కాబట్టి అందులో ప్రధానమయిన ప్రస్తావనలు మాత్రమే ఇస్తున్నాను.

“వాల్మీకి అరణ్యకాండలో చెప్పిన పంపానది ఈ తుంగభద్రే.

లక్ష్మణా! ఈ పంపా సరస్సు ఎంత అందంగా ఉందో చూడు. వైడూర్యమణిలా నిర్మలంగా ఉంది. పద్మాలు, కలువలతో నిండి ఉంది. లేళ్లు, పక్షులతో, రాలిన పూలతో వనమంతా కనువిందుగా ఉంది.

నాకు దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు. సీత దొరికితే…ఇక అయోధ్యకు కూడా రావాలని లేదు. ఈ వనంలోనే ఉండిపోవాలనిపిస్తోంది”

“గంగా స్నానం- తుంగా పానం-అన్నారు. తుంగనీటిలో ఔషధ గుణాలున్నాయి. తుంగనీరు తాగి విద్యారణ్యుడు వేదభాష్యమే రాశాడు”

రాయల కీర్తి దండలో దారంలా రాయాలే కానీ…హంపీ కథే ఒక రామాయణం.

రేపు:- చివరి భాగం-8
“హంపీ చుట్టూ అల్లిన కథలు”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హంపీ వైభవం-1

Also Read :

హంపీ వైభవం-2

Also Read :

హంపీ వైభవం-3

Also Read :

హంపీ వైభవం-4

Also Read :

హంపీ వైభవం-5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com