Saturday, April 20, 2024

హంపీ వైభవం-5

Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని సవాలు చేసిన శిలల కళల సీమ. ఆసేతు హిమాచలం భారతావనిలో అప్పటికి పేరున్న కళాకారులు ఒకసారి హంపీలో తమ విద్యను ప్రదర్శించి…మెప్పు పొంది…మోసుకెళ్లగలిగినన్ని బహుమానాలను పొందాలని ఆరాటపడ్డ సీమ.

అలాంటి హంపీలో దసరా ఉత్సవాలంటే…భూమికి ముత్యాల, రతనాల ముగ్గులు వేయాల్సిందే. ఆకాశమంత పందిరి వేయాల్సిందే. అన్ని స్తంభాలకు అరటిబోదెలు కట్టాల్సిందే. మామిడి, మొగలిపూల తోరణాలు వేలాడాల్సిందే. రంగు రంగుల పూల హారాలతో గాలికి గంధం పూయాల్సిందే. అతిథుల నెత్తిన సుగంధ ద్రవ్యాల తుంపర చల్లాల్సిందే. ఆకాశానికి చిల్లులు పడేలా విజయభేరులు మోగాల్సిందే.

అప్పుడు మంగళ వాద్యాలు మోగుతుండగా విజయనగర సర్వంసహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాన్వాయ్ బయలుదేరుతుంది. మొదట కాల్బలం సైనికులు, వారి వెనుక అశ్వదళం సైనికులు, వారి వెనుక ఏనుగుల మీద సైనికులు, వారి వెనుక మంత్రి సామంత దండనాయకులు, చివర బంగారు తాపడంతో చెక్కి ముత్యాలు కూర్చిన ఏనుగు అంబారీ(పల్లకీ)లో కూర్చున్న శ్రీకృష్ణదేవరాయలు. రాజవీధి ఊరేగింపు అయి…రాయలు మహర్నవమి దిబ్బ మీద ప్రత్యేక ఆసనంలో సుఖాసీనుడవుతాడు.

అప్పుడు సంగీతం తుంగభద్ర తరంగాలతో పోటీ పడుతుంది. నాట్యం విఠోబా ఆలయ నాట్యమండపంతో పోటీ పడుతుంది. సాహిత్యం పంపా విరూపాక్షుడికి వేద మంత్రమవుతుంది. జానపద కళలు విజయనగర వీధులకు గిలిగింతలు పెడతాయి.

ఈ దసరా తొమ్మిది రోజుల ఉత్సవాల కోసం కృష్ణదేవరాయలు ప్రత్యేకంగా మహర్నవమి శాల కట్టించాడు. వాడుకలో జనసామాన్యం దీనికి మహర్నవమి దిబ్బ అని పేరు పెట్టుకుంది.

ఇప్పటిలా ఆరోజుల్లో డ్రోన్లు, జూమ్ లెన్స్ లు, ఎల్ ఈ డి స్క్రీన్లు లేవు. భూమ్యాకాశాలు ఒకటయ్యే ఆ ఉత్సవాలను 360 డిగ్రీల దృశ్యంగా, దేన్నీ వదలకుండా చూడడానికి అంతెత్తున కృష్ణదేవరాయలు ఒరిస్సా గజపతుల మీద విజయం తరువాత కట్టించాడు.

ఆయన కళ్ల ముందు జరిగిన ఆ హంపీ దసరా ఉత్సవాల వైభవం ఏమిటో ఈ దిబ్బ చుట్టూ రాతి శిల్పాల్లో కథలు కథలుగా ఉన్నాయి. దీని పక్కనే అష్టదిగ్గజ కవుల భువనవిజయ మంటపం. దాని వెనుకే కృష్ణరాయల అధికార రాజభవనం. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడానికి రాతి పునాది మీద చెక్కతో కట్టించిన ఈ భవనాలన్నీ తళ్ళికోట యుద్ధంలో అళియ రామరాయలు తల తెగిన తరువాత…మహమ్మదీయ సేనల విధ్వంసంలో కాలి బూడిదయ్యాయి. పునాది రాళ్లు తప్ప ఏమీ మిగల్లేదు.

కురిసినదెచట వాక్కుల జృంభణములోన
కవిరాజు పైన బంగారు వాన?
సలిపినదెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్యవారాంగనా నర్తనంబు?
తొడిగినదెచట నిస్తులరాజహస్తము
కవిపితామహు కాలి కంకణంబు?
విరిసినదెచట ప్రవీణవాచస్పతి
రామలింగని హాస్యరససమృద్ధి?
అది శిలలదిబ్బ, దసారాలకయిన దిబ్బ;
తెలుగు లలితకళాదేవి తీర్చినట్టి
కొలువుకూటపు దిబ్బ; వెన్నెలకు దిబ్బ
మా మహర్నవమిశాల మంటపంబు;
ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి
తెలుగు జెండాకర్ర తీసిరేల?
పిలుచుచున్నది పాలపిట్ట రాయల పేర్లు…
వరుసగా గద్దెనెక్కరదియేల?
పాడుచున్నది రిచ్చపడి కోకిలంగన
అష్టదిగ్గజములేమైరి రారు?
విలుచుచున్నది నెమ్మి విసిగి వన్నెలరాళ్ల
తలుకమ్మదేల వర్తకుల గుంపు?
ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున
చివరతెర జారిపోయిన చిన్నె లరసి
మంగళంబున పాడినమాడ్కినేమొ
తీరి గొంతెత్తుచున్న దీ ద్విజకులంబు”

ప్రస్తుత మహర్నవమిశాల దుస్థితిని చూసి కొడాలి పడ్డ బాధ వర్ణనాతీతం.

ఇది-
కవిరాజు శ్రీనాథుడిని బంగారు వర్షంతో తడిపిన చోటు;
ధూర్జటి దివ్యకలం నర్తించిన చోటు;
అల్లసాని కాలికి బంగారు కంకణం తొడిగిన చోటు;
వికటకవి తెనాలి రామలింగడి హాస్యం పండిన చోటు.

ఇది-
మట్టి దిబ్బ కాదు. శిలల దిబ్బ. దసరాకోసం పుట్టిన దిబ్బ.
తెలుగు లలితకళలను కొలువుతీర్చిన దిబ్బ.

వన్నెచిన్నెలకు అలవాలమయిన దిబ్బ.
తెలుగు జెండా కర్రలో కీర్తి పక్షి రెక్క విప్పి ఎగురుతోంది. ఎందుకు జెండా కర్ర తీసేశారు?

పాలపిట్ట గొంతుచించుకుని రాయల పేర్లు పలుకుతోంది…ఏరీ వారెక్కడ?

కోకిలలు కోరి కోరి పాడుతున్నాయి…
ఏరీ అష్టదిగ్గజ కవులెక్కడ?

విరూపాక్ష గుడి ముందు హంపీ బజారులో వెలకట్టిన వజ్రాల తళుకు అడుగుతోంది…ఏరీ విదేశీ వర్తకులు?

వైభవోజ్వల ఆంధ్ర సామ్రాజ్య మహా విజయనగర నాటకం పూర్తి కాకుండా మధ్యలోనే తెరపడింది…ఎందుకు?

హంపీ స్వర్గసీమ నాటకం ముగింపు సూచకంగా…అక్కడ కొమ్మల్లో పక్షులు గొంతెత్తి అరుస్తున్నాయా?

అలా కొడాలి బాధకు గొంతు కలుపుతూ…కాలచక్రంలో అయిదు వందల ఏళ్లు వెనక్కు వెళ్లి… మహర్నవమి దిబ్బ ఎక్కి విజయనగర దసరా ఉత్సవం చూశాను. భువనవిజయం పునాది రాళ్ల మీద నిలుచుని మేకొక తోకను…తోకకొక మేకను అతికించిన తెనాలి పద్యం విన్నాను. కృష్ణదేవరాయల రాజభవనం గోడ శిథిలాలను తాకి…ఎదురైనచో తన…పద్యం చదివాను. కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చిన సమస్యాపూరణలు చెప్పుకున్నాను. తెలుగు పద్యం బంగారు పల్లకిలో ఊరేగి…వజ్రాల రాశులను కురిపించిన…కృష్ణరాయల ఇంటి గుమ్మం ముందు “కృతులందుటకు పల్లకీ మోయ దొరకొన్న” పద్యం చదివాను. ఇన్నేళ్లుగా నేర్చుకున్న ప్రతి పద్యాన్ని భువనవిజయం వేదికమీద మననం చేసుకున్నాను….ఎదురుగా మహర్నవమి దిబ్బ మీద కూర్చున్న కృష్ణరాయడి సాక్షిగా…

“స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనీ
అతులిత మాధురీ మహిమ?”

“దేశభాషలందు తెలుగు లెస్స…” అని ఆ గాలుల్లో ప్రతిధ్వనిస్తున్న కృష్ణరాయల మాటల సాక్షిగా…

రేపు:-
శిథిల హంపీ-6
“విజయనగర విలాపం”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హంపీ వైభవం-1

Also Read :

హంపీ వైభవం-2

Also Read :

హంపీ వైభవం-3

Also Read :

హంపీ వైభవం-4

RELATED ARTICLES

Most Popular

న్యూస్