Sunday, November 3, 2024
HomeTrending News370 Article: 370 ఆర్టికల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

370 Article: 370 ఆర్టికల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం… ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయటం సరికాదని…370 ఆర్టికల్ రద్దుపై రాష్ట్రపతి ప్రకటనను తప్పుపట్టలేమని ధర్మాసనం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ 30, 2024లోగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుధీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్‌ 5న తీర్పును రిజర్వ్‌ చేసింది. న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులు.

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని పునఃసమీక్ష చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పలుమార్లు ప్రకటించారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో దేశ ప్రజల్లో ఉత్కంట వీడింది. ఈ అంశాన్ని కొన్ని పార్టీలు, నేతలు రాజకీయంగా రాజేయాలని చూసినా తాజా తీర్పు వారికి కనువిప్పనే చెప్పుకోవాలి.

ఇటీవల కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశాల్ని చేర్చింది. కాశ్మీర్ జమ్మూకశ్మీర్‌పై లోక్‌సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. అందులో మొదటిది జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, రెండోది జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు. జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం, అందులో కొన్నింటిని రిజర్వ్‌ చేయడం వీటి ముఖ్య ఉద్దేశం.

జమ్ముకశ్మీర్‌ శాసనసభ స్థానాలను 114కు పెంచుతూ ఒక బిల్లును, కశ్మీర్‌ పండిట్లకు రెండుస్థానాలు కేటాయిస్తూ ప్రవేశపెట్టిన మరో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కశ్మీర్‌లో 47, జమ్ములో 43, పీవోకేలో 24సీట్లు ఉంటాయన్న అమిత్‌ షా…ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన వారికి ఒక సీటు, కాశ్మీర్ నిర్వాసితులైన పండిట్లకు రెండు సీట్లు గవర్నర్ నామినేటెడ్ కోటలో కేటాయించారు. మొదటి సారిగా ఎస్సీ,ఎస్టీ వర్గాలకు 9 స్థానాలను కేటాయించారు.

కాశ్మీర్ లో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే 370 ఆర్టికల్ దన్నుతో ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబాలే లబ్ది పొందాయి. సామాన్య ప్రజలకు లబ్ది చేకూరపోగా ఆర్థికంగా చితికిపోయారు. దీంతో కాశ్మీర్ యువత ఉగ్రవాదానికి ఆకర్షితులు అయ్యారు. ఇలా అందాల కాశ్మీరం కల్లోల కాశ్మీర్ గా మారింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో కాశ్మీర్ పార్టీలు అలజడి సృష్టించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్రం భద్రత కట్టుదిట్టం చేసింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్