గిరిజనులకు సిఎం జగన్ అన్యాయం చేశారని తమ ప్రభుత్వంలో వారికి అమలు చేసిన పథకాలను రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అరకు కాఫీను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళేలా తాము ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయి సాగును ప్రమోట్ చేస్తుందని విమర్శించారు. అరకు కాఫీకి ఆ పేరు తానే పెట్టానని, దావోస్ లో కూడా ఈ కాఫీని పరిచయం చేశానని బాబు గుర్తు చేశారు. గిరిజన విద్యార్ధులకు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇప్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనికోసం తాము తీసుకు వచ్చిన జీవో నంబర్ 3 ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు రద్దుచేసిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు…తాము అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ జీవోను అమలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో అసలు ఉద్యోగాలే రాలేదని, యువతకు ఉపాధి కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఇక్కడి పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. అరకులో జరిగిన ‘రా! కదలిరా!’ బహిరంగ సభలో బాబు ప్రసంగించారు.
అరకు కేంద్రంగా టూరిజాన్ని అభివృద్ధి చేశానని, పోలవరం ముంపు బాధితులను ఆడుకుంటామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామంటూ వరాలు కురిపించారు. దొన్నుదొర ను అరకునుంచి అభ్యర్ధిగా పోటీలో దింపుతున్నామని, అందరూ సహకరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అబ్రహం, కిడారి శ్రవణ్ లకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
45 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ మోసం చేశారని, మద్య నిషేధంపై కూడా మాట తప్పారని బాబు మండిపడ్డారు. పేదవారి ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలని కానీ ఈ ప్రభుత్వం ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకులో గెలిపించడం ద్వారా తెలుగు జాతిని గెలిపించాలని, తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.