దిశ చట్టం అమల్లోనే లేదని అలాంటప్పుడు ఆ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సిఎం జగన్ ఎలా చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఫ్యాన్ మూడు రెక్కలను విరిచేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బాదుడు రెక్కలు ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారని, హింసా రాజకీయాల రెక్కలు సీమ ప్రజలు తుంచేస్తారని, విధ్వంస నిర్ణయాల రెక్కలు కోస్తా ప్రజలు పీకిపారేస్తారని, చివరకు రెక్కలు విరిగిన ఫ్యాన్ మీ చేతిలో పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ ప్రజలు ఇస్తారని ఎద్దేవా చేశారు.
పెట్రోలు రెట్లు దేశంలో ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని, చలాన్ల పేరుతో ఆటో కార్మికుడిపైన ఏటా యాభై వేల రూపాయల భారం వేస్తూ ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఫైన్ ఇస్తున్నారని… రాష్ట్రంలో పది లక్షల మంది డ్రైవర్లు ఉంటే కేవలం రెండున్నర లక్షల మందికే వాహన మిత్ర ఇస్తున్నారని దుయ్యబట్టారు. గ్రీన్ ట్యాక్స్ తమ హయంలో 200 రూపాయలు ఉండేదని ఇప్పుడది కనిష్టంగా 2,395 రూపాయలు, గరిష్టంగా 30,820 రూపాయలకు పెంచారని ఇది దోపిడీ కాక మరేమిటని నిలదీశారు. రాష్ట్రంలో రవాణారంగం కుదేలైపోయిందని, ఒకప్పుడు డ్రైవర్లు లారీ ఓనర్లు అయ్యారని, ఇప్పుడు ఓనర్లు క్లీనర్లు అయ్యారని, ఇదో చెత్త పరిపాలన అంటూ మండి పడ్డారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని, కానీ ఆస్పత్రి యాజమాన్యాలు బిల్లుల కోసం సమ్మెలు చేస్తున్నారన్నారు.
జగన్ పాలనతో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరూ తమ స్టార్ క్యంపెయినర్లేనని…. ప్రతి నిరుద్యోగి, ఎండిన ప్రతి ఎకరా, మండిన ప్రతి గుండె, పన్నుల బాడుడుకు గురైన ప్రతి పేదవాడు, నాణ్యత లేని మద్యంతో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రతి కుటుంబం తమ క్యంపెయినర్లని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఐదు కోట్ల ప్రజలను తెలుగుదేశం-జనసేన కూటమికి స్టార్ క్యంపెయినర్లుగా తయారు చేసి వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి నిల్- మాటలు ఫుల్ అంటూ ఎమ్మెల్యే అనిల్ పై విమర్శలు గుప్పించారు. రా కదలిరా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు ఇచ్చారు.