Friday, November 22, 2024
HomeTrending Newsతమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం

తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అరంగేట్రం చేసింది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ పార్టీ అధ్యక్షుడుగా తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రజల్లోకి రానుంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని 2026 శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని పార్టీ అధ్యక్షుడు విజయ్ శుక్రవారం ప్రకటించారు. పారదర్శక, కుల రహిత, అవినీతి రహిత పరిపాలన అందించటమే లక్ష్యంగా తమ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని వివరించారు.

నెలరోజులుగా తమిళనాట హీరో విజయ్ పార్టీపై వచ్చిన అనేక ఊహాగానాలకు తెరపడింది. తమిళనాడులో అత్యధిక స్థాయిలో అభిమాన గణం, భారీ క్రేజ్ ఉన్న విజయ్ ఎట్టకేలకు రాజకీయాల్లోకు రావటం కీలక మలుపు అని చెప్పవచ్చు. 50 ఏళ్ళ విజయ్ పూర్తి పేరు జోసెప్ విజయ్ కాగా సిని పరిశ్రమలో దళపతి విజయ్ గా ప్రాచుర్యంలోకి వచ్చాడు.

పార్టీ పేరులోని మొదటి పదం ‘తమిళక’ అంటే తమిళం. ‘వెట్రి’ అంటే విక్టరీ అని అర్ధం వస్తుంది. చివరి పదం ‘కజగం’ అంటే క్లబ్/పార్టీ అని వస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ పేరుకి అర్ధం.. ‘తమిళ విక్టరీ క్లబ్’ అని వస్తుంది. సమాజంలో మార్పు రావాలంటే అభిమాన సంఘం మాత్రమే సరిపోదని, రాజకీయ రంగంలో దిగాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భూమి మీద పుట్టుకతో అందరూ సమానమే అనే సమానత్వ సూత్రంతో తాను ముందుకు వెళ్తానని అది ప్రజాశక్తి ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ .. GOAT అనే  సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఇక సినిమాలకు విరామం ఇచ్చి పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకే పరిమితమవుతానని వెల్లడించారు. విజయ్ తన అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో చెన్నైలో సమావేశమై పార్టీ పేరును, జెండా, అజెండా వంటి అంశాలను  పలు దఫాలుగా చర్చించారు.

తమిళ సినీ రంగానికి, రాజకీయ రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. తమిళనాట హీరోలు పార్టీలు ప్రారంభించడం కొత్తేమీ కాదు.. ఇటీవలి కాలంలో కొత్త పార్టీలు పెట్టిన, పెడతామని ప్రకటించిన హీరోలెవరూ నిలువలేకపోయారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటివారు సినీరంగం నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టిన వారు. వీరిముగ్గురూ తమిళనాట తమ ముద్ర వేశారు. వీరిబాటలో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ విజయ్ కాంత్, విశ్వనటుడు కమలహాసన్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక పోయారు. విజయ్ కాంత్ పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సభలో అడుగుపెట్టింది. కమల్ హాసన్ పార్టీ ఊసేలేకుండా పోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించిప్పటికీ.. కొద్దిరోజుల్లోనే రాజకీయాలు తనకు సరిపోవని ప్రకటించారు.

తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. డీఎంకే అధ్యక్షుడు, సిఎం స్టాలిన్‌కు సరైన ప్రతి నాయకుడిగా సరైన నేత లేరు. ఆయన  స్థాయిలో జనాకర్షణ ఉన్న ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల డీఎంకేకు ఎదురులేదన్న వాదన వినిపిస్తోంది. అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ స్టాలిన్ స్థాయికి ఎదగలేకపోయారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడుగా ఉన్న అన్నామలై కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ.. మీడియాలో వచ్చినంత ప్రచారం జనంలో లేదు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి విజయ్ రావటం సరైన సమయమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్