రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తనను కలిసిన పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం అనంతరం వారంరోజులపాటు హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు నిన్న ఉండవల్లికి చేరుకున్నారు.
నేడు పార్టీ సీనియర్ నేతలతో బాబు ఇష్టాగోష్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ చేపట్టిన రా కదలిరా సభలు, లోకేష్ శంఖారావం యాత్ర తో పాటు వైసీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరికపై కూడా నేతలు బాబు వద్ద ప్రస్తావించారు. చాలామంది నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ అందరినీ తీసుకోవడం సాధ్యం కాదని బాబు అన్నట్లు తెలిసింది. అమిత్ షా తో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా బాబు నేతలకు చూచాయగా వివరించినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 56 రోజులే ఉందని, నేతలంతా ఎన్నికల మూడ్ లోకి రావాలని బాబు సూచించారు.
కాగా, 1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 84లో జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో ఆ పార్టీ తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టింది. నాడు పర్వతనేని ఉపేంద్ర, ప్రొ. సి లక్ష్మన్న, పి. రాధాకృష్ణన్, ఎల్లా శశిభూషణ్ రావు, బి.సత్యనారాయణ రెడ్డిలు టిడిపి నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆ పార్టీ ప్రాతినిధ్యం పెద్దల సభలో ఉంటూనే వస్తోంది. తొలిసారి ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీనితో 2020, 2022, 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెల్చుకోలేకపోయింది. 40 ఏళ్ళ తరువాత తెలుగుదేశం పార్టీ పెద్దల సభ్యలో కనీస ప్రాతినిధ్యం కోల్పోవాల్సి వచ్చింది.