రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా తడబడింది. యశస్వి జైస్వాల్-73; శుభ్ మన్ గిల్- 38; ధృవ్ జురెల్-30 (నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు 302 పరుగుల వద్ద నేటి రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 353 కు ఆలౌట్ అయ్యింది. నిన్న 31 పరుగులతో ఉన్న ఓలీ రాబిన్సన్ అర్ధ సెంచరీ (58) పూర్తి చేసిన తరువాత జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. షోహిబ్ అషీర్, జేమ్స్ అండర్సన్ లు డకౌట్ గా వెనుదిరిగారు. నిన్న సెంచరీ (106) పూర్తి చేసిన రూట్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 122తో నాటౌట్ గా ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా 4; ఆకాష్ దీప్ 3; సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా 4 పరుగులకే కెప్టెన్ రోహిత్ (2) వికెట్ కోల్పోయింది. జైస్వాల్-గిల్ లు రెండో వికెట్ కు 82 పరుగులు సాధించారు. గిల్ 38 రన్స్ చేసి పెవిలియన్ చేరగా.. రజిత్ పటీదార్ -17; రవీంద్ర జడేజా-12 సర్ఫరాజ్ ఖాన్-14; అశ్విన్-1… మాత్రమే చేసి ఔటయ్యారు.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసిన ఇండియా ఇంకా 134రన్స్ వెనకబడి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోహిబ్ బషీర్ 4 వికెట్లతో సత్తా చాటగా… టామ్ హార్ట్ లీ 2; అండర్సన్ 1 వికెట్ సాధించారు.