Saturday, November 23, 2024
HomeTrending Newsప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు: ఖర్గే హామీ

ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు: ఖర్గే హామీ

ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికీ నెలకు ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన అయిదు గ్యారంటీలు, తెలంగాణలో  హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, అలాగే ఏపీలో కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన న్యాయ సాధన సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  సిఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు, జన సేన అధ్యక్షుడు పవన్ ముగ్గురూ బిజెపితో కలిసి ఉన్నారని, ఏపీకి రావాల్సిన విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇండియా కూటమికి అధికారం ఇవ్వాలని, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని,  విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఇచ్చిన హక్కులను సాధించి పెట్టడమే తమ అజెండా అని ఖర్గే స్పష్టం చేశారు.  దేశంలో కాంగ్రెస్ పార్టీ హయంలోనే దళితులు, మైనార్టీలు, పేదలు, కార్మికులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

వైఎస్సార్ ఆశయ సాధన కోసం పోరాడుతున్న తానే ఆయనకు నిజమైన వారసురాలినని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించుకున్నారు. హామీల విషయంలో మాట తప్పి, మడమ తిప్పిన జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. బాబు, జగన్ లు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2.30  లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్, ప్రతి జనవరిలో జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని విస్మరించారని అన్నారు. నీటి పారుదల ప్రాజక్టులు, మద్య నిషేధం విషయంలో కూడా జగన్ మాట తప్పారని షర్మిల విమర్శించారు.  ఈ సభలో డా. రఘువీరారెడ్డి, మాణిక్యం ఠాగూర్, కెవిపి రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్