Saturday, July 27, 2024
Homeతెలంగాణతెలంగాణకే పరిమితమైన బీఆర్ఎస్

తెలంగాణకే పరిమితమైన బీఆర్ఎస్

పార్లమెంటు ఎన్నికలు తరుముకోస్తుంటే బీఆర్ఎస్ నాయకత్వంలో ఉలుకు పలుకు లేదు. దేశ రాజకీయాలను శాసిస్తామని చెప్పిన గులాబీ నాయకత్వం తీరు ఆచరణలో భిన్నంగా కనిపిస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే లోక్ సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేస్తున్న నేతలు…. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపి రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు.

అప్పుడప్పుడు బీఆర్ఎస్ ఏపి అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రకటనలు చేస్తున్నా.. మిగతా రాష్ట్రాల నేతలు హైదరాబాద్ అడుగు తొక్కడం మానేశారు. తెలంగాణలో కారు ఓటమి తర్వాత మహారాష్ట్రలో అనేక మంది నేతలు ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. కర్ణాటకలో పార్టీ నిర్మాణమే జరగలేదు. మిత్రపక్షమైన JD U నేత కుమారస్వామి బిజెపితో జత కట్టారు.

ఏపిలో విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరిద్దామని శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఓటమి తర్వాత ఆ అంశం పక్కన పడింది. పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు… బీఆర్ఎస్ ఓటమితో వైసిపిలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ దారి తాము చూసుకున్నారు.

భారత రాష్ట్ర సమితి(BRS)గా రూపం మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)ని సరిహద్దు రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగా మహారాష్ట్రలో కారుకు ఎదురు లేదన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. నెలకు ఒకసారి పార్టీ బహిరంగసభలు నిర్వహించి సరిహద్దు జిల్లాల్లో జోష్ తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్ సమన్వయ కర్తలుగా మహారాష్ట్ర నుంచి రోజు చేరికలు ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించేవారు.

తెలంగాణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కూడా ప్రవేశం లేని ప్రగతిభవన్.. మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరేందుకు వచ్చే వారికి విడిది ప్రాంతంగా మారింది. తెలంగాణ ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వెళితే తెరుచుకోని ప్రగతి భవన్ పాటాకులు(గేట్లు)… మహారాష్ట్ర నుంచి వచ్చామంటే గేట్లు బార్లా తెరుచుకునేవి. వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు అల్పాహారం నుంచి భోజనం వరకు సకల మర్యాదలు జరిగేవి.

భొథ్, పిట్లం, బెజ్జూర్ ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణ నేతలు మహారాష్ట్ర నుంచి వచ్చామని చెప్పుకుని గులాబీ అధినేత కెసిఆర్ ను కలిశారని తెలంగాణ భవన్ వర్గాలు, పార్టీ నేతలు అప్పట్లో చెప్పుకునేవారు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారిలో  ఒకరిద్దరు రాజకీయ నేతలు కాగా అధికశాతం రాజకీయాలతో సంబంధం లేని వారు ఉండేవారని… జనసమూహం కోసం తెలిసిన వారిని తరలించారని అంటారు. వచ్చినవారిలో అధికశాతం హైదరాబాద్ చూసేందుకు, కాళేశ్వరం సందర్శించేందుకు ఆసక్తి  చూపేవారని.. కెసిఆర్ ను కలిసి సంబురపడేవారని హాస్యోక్తులు వినిపించేవి.

ఓటమి తర్వాత మొదటిసారి నల్గొండ సభలో పాల్గొన్న అధినేత కెసిఆర్ తిరిగి ప్రజల్లోకి రాలేదు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజల్లోనే ఉంటారని గులాబీ నేతలు చెప్పుకొస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల సంగతి దేవుడు ఎరుగు… స్వరాష్ట్రంలో సత్తా చాటుకుంటే చాలు అని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్