Monday, April 15, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపద్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి?

పద్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి?

తెలుగు పద్యం అందచందాలకు మురిసిపోని తెలుగువారుండరు. పద్యంలో ఒక్కోసారి కొన్ని పదాలు అర్ధం కాకపోయినా పద్యం చెవిలో మారుమోగుతూనే ఉంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకం లాంటి పద్యాలు తెలుగు వాడుక భాషలో భాగమైపోయాయి. ఇదివరకు ఉన్నత పాఠశాల వరకూ తప్పనిసరిగా పిల్లలు తెలుగు పద్యాల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులవల్ల ఒక భాషగా తెలుగు చదువుతున్నా పద్యాలను నోటికి నేర్చుకునే సరదా, పోటీ తగ్గాయి. నిజానికి వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు సాహిత్య చరిత్రలో పద్యానిది సింహభాగం.

మిగతా భారతీయ భాషల్లో కూడా పద్యం ఉన్నా తెలుగు పద్యంలోలా యతి, ప్రాసలు స్థిరపడి ఒక తూగుతో సాగినట్లుగా లేవు. సంస్కృతంలో ఛందస్సు ఉన్నా తెలుగు పద్యంలోలా ప్రాస, యతి నియమాలు లేవు. శబ్దాలంకారాలు కొన్ని శ్లోకాలలో అందంగా కనిపించినా తెలుగు పద్యం ప్రత్యేకత వైవిధ్యమైనది.

తెలుగు భాషా పరిరక్షణకు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంఘాల తెలుగు కూటమి ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాల్లో రచ్చబండ పేరిట డిజిటల్ మాధ్యమం వేదికగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 24-02-2024న జరిగిన రచ్చబండలో ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత, రచయిత పమిడికాల్వ మధుసూదన్ ‘తెలుగు పద్యం ప్రత్యేకత’ అన్న అంశంపై మాట్లాడారు. స్వీడన్, జర్మనీ, బ్రిటన్, ఆఫ్రికా, అమెరికా, చెన్నై, బెంగుళూరు… ఇలా వివిధ ప్రాంతాల నుండి తెలుగు సంఘాల ప్రతినిధులు, రచయితలు, భాషా పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు ఈ రచ్చబండలో పాల్గొన్నారు.

తెలుగు పద్యాన్ని ఎందుకు కాపాడుకోవాలో మధుసూదన్ సోదాహరణంగా వివరించారు.  అందులో ప్రధాన అంశాలు –  వచనం ఎంత గొప్పగా ఉన్నా తిరిగి అలాగే అప్పజెప్పడం సాధ్యం కాదు. పద్యంలో ఎంత కఠినమైన పదాలున్నా యతిప్రాసలు, గణాలు, పంక్తిలో అక్షరాల సంఖ్య వల్ల సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎంతో కొంత రాగంలో పాడుకోవడంవల్ల.. రాగం వల్ల ధారణ మరింత  సులభమవుతుంది. పద్యంనోటికి రావడంవల్ల తెలుగు భాషలో ఉన్న పద సంపద మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. గంట ప్రాణాయామం చేస్తే కలిగే ఉపయోగాలు… పది పద్యాలు స్పష్టంగా పలికితే కలుగుతుందని పెద్దవారు చెప్పారు. తెలుగు పద్యం అందచందాల గురించి నన్నయ మొదలు నిన్న మొన్నటి సినారె వరకూ ఎవరెవరు ఏమేమి చెప్పారో తెలుసుకుంటే పద్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకు తెలుస్తుంది. సాధారణ వచనంలాగా చదివితే పద్యంలో మజా ఉండదు. అలాగని నాటకంలో పాత్రధారులు పాడినట్లు అంతులేని రాగంతో పాడాల్సిన అవసరం లేదు.

వేమన, సుమతి, భాస్కర, నృసింహ, దాశరథి శతకాల పద్యాలవల్ల చిన్నతనంలో తెలుగు భాష తెలిస్తే పెద్దయ్యాక అందులో నీతి దారిదీపమై కాపాడుతుంది. మూడు, నాలుగు దశాబ్దాల కిందటి వరకు సాహిత్య విద్యార్ధులు వేల పద్యాలు నోటికి చెబితే…. అక్షరం ముక్క చదవని సామాన్యులు కూడా వందల పద్యాలు చెప్పగలిగేవారు. ‘బావా ఎప్పుడొచ్చితీవు’, ‘ఏనుంగునెక్కి’, ‘ధారుణి రాజ్యసంపద’, ‘భక్తయోగ పదన్యాసి’, ‘ఇచ్చోటనె ఏ సత్కవీంద్రుని..’, ‘జెండాపై కపిరాజు’ లాంటి పద్యాలు సామాన్యుల నోళ్ళల్లో నాని నాని … వాడుక భాషలో భాగమైపోయాయి. అలాంటి పద్యం సినిమా పాట వల్ల కొంత వెనక్కువెళ్ళింది. సినిమా పాటలు నేర్చుకుంటున్నట్లు ఇప్పటితరం తెలుగు పద్యాలను నేర్చుకోవడంలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటే బైట రాష్ట్రాలు, బైట దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులే పద్యాలను బాగా వంటపట్టించుకుంటున్నట్లు ఉంది. తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానానికి, పద్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆధునిక కాలంలో కూడా గుర్రం జాషువా, కొడాలి వెంకట సుబ్బారావు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు లాంటి ఎందరో తెలుగు పద్యాన్ని బంగారు పల్లకీలో మోసి మనకందించారు. ఆ పల్లకిని అలాగే భావి తరానికి అందించాల్సిన బాధ్యత మనమీద ఉంది. పద్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన భాషను, మన సంస్కృతిని, అంతులేని మన సాహిత్య సంపదను కూడా కాపాడుకున్నవాళ్ళమవుతాము.

ప్రసంగం అనంతరం వివిధ దేశాల నుండి రచ్చబండలో పాల్గొన్నవారు ప్రామాణిక భాష, మాండలికం, అన్యభాష పదాల ఉచ్చారణ, తెలుగులో కొత్త పారిభాషిక పదాల తయారీ, కొత్త నిఘంటువుల తయారీ అంశాల మీద అడిగిన ప్రశ్నలకు మధుసూదన్ సుదీర్ఘమైన వివరణలు ఇచ్చారు.

  • డా. సగిలి సుధారాణి
    9490428825
RELATED ARTICLES

Most Popular

న్యూస్