రవితేజ తన కెరియర్లో చాలామంది కొత్త దర్శకులకు అవకాశాన్నిస్తూ వచ్చాడు. అలాగే ఆయన కార్తీక్ ఘట్టమనేనికి కూడా ‘ఈగల్’ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. రవితేజ డిఫరెంట్ లుక్ తో కూడిన పోస్టర్లు వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. టీజర్ .. ట్రైలర్ ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతూ వెళ్లాయి.
అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు యాక్షన్ సీన్స్ మాత్రమే ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ .. సాంగ్స్ కనెక్ట్ కాలేదనే టాక్ వచ్చింది. అలా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతోంది. రేపటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా .. ఈటీవీ విన్ ద్వారా అందుబాటులోకి రానుంది. రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఒకే రోజున వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
ఈ సినిమాలో రవితేజ సహదేవ్ గా .. ఈగల్ గా కనిపిస్తాడు. సహదేవ్ గా ఆయన తన చుట్టూ ఉన్న ప్రజలకి మంచి చేయడానికి తనవంతు కృషి చేస్తాడు. అయితే అది నచ్చని కొన్ని పెద్ద తలకాయలు అతణ్ణి అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాయి. వాళ్లను ఎదుర్కోవడానికి అతను ‘ఈగల్’ గా మారతాడు. రవితేజ సరసన నాయికగా కావ్య థాపర్ కనిపించగా, జర్నలిస్టుగా ఒక ముఖ్యమైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. దేవ్ జాన్డ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.