Saturday, July 27, 2024
HomeTrending Newsపొత్తుల పేరుతో టిడిపి ఎత్తులు.. కాపుల అసంతృప్తి

పొత్తుల పేరుతో టిడిపి ఎత్తులు.. కాపుల అసంతృప్తి

తెలుగుదేశం – జనసేన పొత్తు కూటమిలో అలజడి సృష్టిస్తోంది. సీట్ల పంపకాల్లో జనసేనకు న్యాయమైన వాటా దక్కలేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు నైతిక మద్దతు ఇచ్చి వెన్ను దన్నుగా ఉన్న పవన్ కళ్యాణ్ ను మోసం చేశారని కాపులు మండిపడుతున్నారు.

175 శాసనసభ స్థానాల్లో కేవలం 24 విదిల్చి వాటిలో జనసేనకు అనుకూలంగా ఉండే సీట్లు కూడా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ సీటు మొదట జనసేనకు అనుకున్నారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఈ స్థానంలో ఆ పార్టీ నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్దం అయ్యారు. ఉన్నట్టుండి సిట్టింగ్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

ఒక్కరోజులోనే సీటు తారుమారు చేయటంపై గోదావరి జిల్లాల కాపు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కందుల దుర్గేశ్ నిడదవోలు నుంచి బరిలోకి దిగుతారని… పార్టీ నిర్ణయమే శిరోధార్యమని కందులతో చెప్పించారు. ఈ అంశంలో కందుల, పవన్ లు సర్దుబాటుకు సిద్దమైనా కాపు సామాజికవర్గం సంతృప్తి చెందటం లేదు. మరోవైపు నిడదవోలు తెలుగుదేశం పార్టీకే కేటాయించాలని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చేపట్టారు. ఇదే పరిణామాలు కొనసాగితే రాజమండ్రి రూరల్ వైసిపి ఖాతాలో పడినట్టేనని విశ్లేషణ జరుగుతోంది.

చంద్రబాబు గతం పరిశీలిస్తే మిత్రపక్షాలతో అవసరానికి తగినట్టుగా వ్యవహరిస్తారనే అపవాదు ఉంది. కష్టాల్లో ఉన్నపుడు కలుపుకుపోయే బాబు అవసరం తీరితే అంతే దూరం పాటిస్తారని… వామపక్ష నేతలు మొదటి నుంచి పవన్ ను హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా బాబు సాయం చేస్తున్నందునే పవన్ వారితో కొనసాగుతున్నారని జనసేనలో కొందరు ముఖ్యనాయకులు పొత్తును సమర్థిస్తున్నారు.

కాపు పారిశ్రామికవేత్తలు, మేధావులు తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యతిరేకిస్తున్నారు. చేగొండి హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నేతలు చంద్రబాబు – జనసేనను మోసం చేశారని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బాబు రాజకీయ జీవితం అవసాన దశకు చేరుకుందని, రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్న పవన్ టిడిపితో జతకట్టడం ఆత్మహత్యాసదృష్యం అంటున్నారు. మరో పర్యాయం ప్రజల తరపున పోరాడితే జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ తో కొందరు కాపు పెద్దలు వివరించినట్టు తెలిసింది.

పుండు మీద కారం చల్లినట్టుగా తాడేపల్లిగూడెంలో ఉభయ పార్టీల బహిరంగ సభ నిర్వహించటం కాపులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ 24 స్థానాలపై మరోసారి స్పందించారు. వ్యూహం నాకు వదలండి 24 పవర్ ఏంటో చూపిస్తా అన్న వ్యాఖ్యలపై కాపు నేతలు మండిపడుతున్నారు. బహిరంగసభ వద్ద ప్రదర్శించిన జనసేన యాడ్… పవన్ కళ్యాణ్ పోత్తులకు కట్టుబడి ఉండేవిధంగా రూపొందించారని విసుక్కుంటున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారో ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. ఈ దఫా భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడుగా ప్రతి ఎన్నికలకు కొత్త ప్రాంతం నుంచి పోటీ చేయటం ద్వారా ప్రజల్లో పార్టీ పలుచన అవుతుందని.. ఓ పార్టీ అధ్యక్షుడిగా పవన్ పై ప్రజల్లో విశ్వాసం సడలుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పవన్ పోటీ చేసే స్థానం కూడా తెరవెనుక టిడిపి నిర్ణయిస్తోందని వినికిడి. తద్వారా జనసేన టిడిపి చుట్టూ పరిభ్రమిస్తోందనే ఆలోచన ప్రజల్లో కలిగించటమే పనిగా పెట్టుకున్నారని అంటున్నారు. దీంతో జనసేన బలోపేతం కాకపోగా.. టిడిపి మీద ప్రజలకు విశ్వాసం కలిగేట్టు చేయటం ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర పూరిత చర్యలు సాగుతున్నాయని కాపు మేధావులు విమర్శిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్