Tuesday, November 26, 2024
HomeTrending Newsబీఆర్ఎస్ ఎంపి అభ్యర్థుల తొలి జాబితా

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థుల తొలి జాబితా

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పార్టీ తరపున పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించారు.

ఆది, సోమవారాల్లో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించి.. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని గుర్తు చేసిన కెసిఆర్… ఓటమి శాశ్వతం కాదని నేతలకు సర్దిచెప్పారు.

కేటిఆర్, హరీష్ రావులు నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేసినపుడు అగ్రనేతల వైఖరి… అధికారంలో ఉన్నపుడు అనుసరించిన విధానాలపై నేతలు ప్రశ్నించారు. కెసిఆర్ తో జరిగిన సమావేశంలో అంతా నిశబ్ధం… అధినేత చెప్పింది విని బయటకు రావటమే నేతల పని అన్నట్టుగా మారింది.

లోక్ సభ నియోజకవర్గాల వారిగా జరిగిన సమావేశాల్లో కొంతమంది నేతలే పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు రాలేదు. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులు అధినేతకు వివరించే వారు కరువయ్యారు. కాంగ్రెస్ లో కలహాలు.. ప్రజలే బీఆర్ఎస్ పాలనను మిస్ అయ్యారనే కోణంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.

ఎన్టీఆర్ కే ఓటమి తప్పలేదని.. ప్రజల కోసం మనం చేయాల్సింది చేశామని కెసిఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు ఇదే కోణంలో కెసిఆర్ ప్రసంగాలు కొనసాగితే ఓటర్ల నుంచి ఆదరణ కష్టమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరగటానికి కారణాలు విశ్లేషించి… శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకొని… ఓటర్లకు వివరణ ఇస్తేనే కారు ప్రయాణం సాఫీగా సాగనుందని చెపుతున్నారు. అధికార ప్రక్షం తప్పిదాలే అందలం ఎక్కిస్తాయనే భ్రమల్లో ఉంటే బీఆర్ఎస్ మరింత అగాధంలోకి జారుకున్నట్టే అని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.

కేటిఆర్, హరీష్ రావు, కవిత కాంగ్రెస్ హామీలు, పాలనపై విమర్శలు చేస్తున్నా ముగ్గురి మధ్య సమన్వయము ఉన్నట్టు లేదని గులాబీ నేతల్లో గుసగుసలు సాగుతున్నాయి. ఇప్పటికీ ఎవరి వర్గాలు వారివి అన్నట్టుగా సాగుతోందని.. కాళేశ్వరం యాత్రలో అది స్పష్టం అయిందని అనుకుంటున్నారు.

కాంగ్రెస్, బిజెపిల వ్యూహాలు చూస్తుంటే ముందు బీఆర్ఎస్ ను కకావికలం చేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారంలో ఉంటారనే కోణంలో ఆ పార్టీల విమర్శలు సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా లేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఉహించుకోలేమని… అధినేత కెసిఆర్ చొరవ తీసుకుంటేనే పార్టీ గాడిలో పడుతుందని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్