మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరి నుంచి కెసిఆర్ వరకు ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్దిలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఆ ఒరవడి కొనసాగుతోంది. అదే కోవలో సిఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్క్ ఉండేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
హైదరాబాద్‌కు కీలకమైన ఔటర్ రింగ్‌రోడ్డు వరకు GHMCని విస్తరించడానికి సర్కారు కసరత్తు చేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి మెగా గ్రేటర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జూన్ నాటికి ప్రణాళికను పూర్తిచేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ప్రాథమిక నివేదికను ఎన్నికల కోడ్ తరువాత సీఎం ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లకుగాను 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి వరకు ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుంది. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అంచనా. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు పెరిగే అవకాశం ఉంది. మెగా గ్రేటర్ గా ఉంటుందని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించమని ఆదేశించారు.
2007లో 12 మున్సిపాల్టీలు, 8 గ్రామపంచాయతీలతో GHMC ఏర్పాటైంది. దాదాపు కోటి జనాభా ఉండగా 150 డివిజన్లు ఏర్పాటు చేశారు. 150 డివిజన్లలో బల్దియాకు వచ్చిన నిధులతో బాగానే అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతోంది.
రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్‌ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఐదింటిని విలీనం చేసి.. వచ్చే 30 ఏళ్లు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్‌ను కూడా విస్తరించాలని సీఎం భావించారు. ORR లోపల ఉన్న సంస్థలన్నింటిని కలిపి మెగా గ్రేటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 3 నెలల్లో దీనిపై ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో ఉన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక అమలులోకి వస్తే అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న శివారు ప్రాంతాలు అభివృద్దికి నోచుకుంటాయి. అదే సమయంలో ORR వెంబడి రైల్వే లైన్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రజారవాణా మెరుగవుతుంది. రెండో దశ అందుబాటులోకి రావటం సంతోషకరం కాగా.. MMTS సర్వీసులు పెంచితే నగర రోడ్లపై రద్దీ తగ్గి… కాలుష్య భూతం కాటేయకుండా ఉంటుంది.
లోక్ సభ ఎన్నికలు ముగియగానే కార్యాచరణ చేపట్టి… రాబోయే GHMC ఎన్నికల నాటికి సిఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వబోతున్నారు.
-దేశవేని భాస్కర్