ఉత్తరప్రదేశ్ బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి వ్యతిరేక పవనాలు కనిపించాయని వార్తలు రావటంతో ఈ రెండు పార్టీల అగ్రనేతలు అప్రమత్తం అయ్యారు. యూపిలో బిజెపిని నిలువరించేందుకు అగ్రనేతలు బరిలోకి దిగుతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మూడుసార్లు విజయం సాధించారు.
2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలిచారు. 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్ చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశ్ పోటీలో ఉండాలని నిర్ణయించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్ 30వ తేదీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున అమేథి, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వయనాడ్‌లో పోలింగ్ ప్రక్రియ ముగియగానే అమేథీ, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాలపై అన్నాచెల్లెళ్లు దృష్టి సారించనున్నట్లు సమాచారం.
అమేథి, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మే 3. చివరి తేదీకి రెండు రోజుల ముందు రాహుల్, ప్రియాంక నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు ముందే.. అన్నాచెల్లెళ్లు అయోధ్య బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలీ నుంచి మొన్నటివరకు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2019 వరకు సోనియానే గెలుపొందారు. ఇటీవల సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అమేథిలో 2004 నుంచి వరుసగా మూడుసార్లు రాహుల్ ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నాయకులు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు.
రాయ్ బరేలి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉన్నా అమేథి నుంచి రాహుల్ పోటీ చేయకపోవచ్చని విశ్లేషణ జరుగుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు ఈ విధమైన ప్రచారం చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చే యత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు.
-దేశవేని భాస్కర్