ఎడారిలో అల్లావుద్దీన అద్భుత ద్వీపంలా ఉండే దుబాయి వరుణుడి ప్రతాపానికి తల్లడిల్లుతోంది. గత నెలలో కుండపోత వాన మరువకముందే.. గురువారం వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. అసలే రద్దీగా ఉండే దుబాయిలో రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. దుబాయి నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెల్లవారుజామున 3 గంటల నుంచి భారీ వర్షాలు పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మే 3వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయి వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి, బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
ఏప్రిల్ 14, 15 తేదీల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. 1949 నుంచి ఇప్పటి వరకు అంతటి భారీ వర్షం రాలేదని దుబాయి అధికారులు వెల్లడించారు.వ్యాపార వర్గాలు, పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండే యుఏఈ లోని దుబాయి, షార్జా, అబుదాబి నగరాలు వర్షాలతో సతమతం అవుతున్నాయి.
-దేశవేని భాస్కర్