వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. పార్టీలు మారిన నేతల మధ్య ప్రధానంగా ఓరుగల్లు పోరు జరుగుతోంది. బిజెపి నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుదీర్ కుమార్ తలపడుతున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజనలో SCలకు కేటాయించిన వరంగల్ పరిధిలో పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘనపూర్, పర్కాల్, భుపాలపల్లె శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయ కేతనం ఎగురవేసింది. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలిచినా మారిన సమీకరణాల్లో కాంగ్రెస్లో చేరి ఆయన కుమార్తె కావ్యకు ఎంపి టికెట్ దక్కించుకున్నారు.
2009లో కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, 2014లో కడియం శ్రీహరి, 2019లో పసునూరి దయాకర్ ఎంపిలుగా గెలిచారు. వరంగల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 18,36,770గా ఉండగా మహిళా ఓటర్లు సమానంగా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలు ముందు ఉండటంతో గెలుపు ఓటముల్లో వీరి పాత్ర కీలకంగా మారింది.
గతంలో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పోటీ పెట్టేందుకు జంకేవి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ముందుకు వచ్చే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్ లో నెలకొంది. పార్టీ పట్టు సడలకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలిపారు.
బీఆర్ఎస్ నుంచి మొదట కడియం పేరు ప్రకటించగా నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరి కూతురికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, నేతలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు వరంగల్ తూర్పు నేతలు కావ్యకు సహాయ నిరాకరణ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నేతలను బుజ్జగించటంతో కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. ఈ స్థానం నుంచి 36 ఏళ్ల తరువాత తొలిసారిగా మహిళా అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇక్కడి నుంచి 1984లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ టి.కల్పనాదేవి ఎంపీగా విజయం సాధించారు.
మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ ను సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు వారి సలహా సూచనల మేరకు కేసీఆర్… సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కడియం శ్రీహరి పార్టీ మారటంతో కొంత తడబడ్డా.. ఇటీవల కెసిఆర్ ప్రచారంతో గులాబీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వరంగల్ నగరంలో అండర్ డ్రెయినేజీతో పాటు వరంగల్‌లో ఎయిర్‌పోర్టును, మెగా టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తామని, ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీలోకి నేతల వలసలతో మరింత బలపడ్డామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌కు గత రెండు పర్యాయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. 2014, 2018లో బీఆర్‌ఎస్ తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. 1984లో ఇక్కడి (హనుమకొండ) నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలిచాక.. మళ్లీ ఏ ఎన్నికల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 40 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఆశలు చిగురించాయి.
గతంలో ఐదారు వేల ఓట్లు కూడా రాని నియోజకవర్గాల్లో ఏకంగా 30 వేల పైచీలుకు ఓట్లు పెరగడంతో బిజెపిలో జోష్ కనిపిస్తోంది. ఈ దఫా కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
కడియం కావ్య బైండ్ల సామాజికవర్గం కాగా బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు మాదిగ సామాజికవర్గం. కావ్య భర్త గుంటూరుకు చెందిన డాక్టర్, ఆయన ముస్లిం కావటంతో ప్రత్యర్థులు ఎన్నికల అంశంగా ప్రచారం చేస్తున్నారని టాక్. కావ్య స్థానికేతరురాలని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్యకు ఇస్తే సునాయాస విజయం దక్కేదని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు.
బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ అందరికి సుపరిచితుడైనా వరంగల్ నగరంలో క్రైస్తవ ఓట్లు ఎంతవరకు లభిస్తాయో సందిగ్ధం నెలకొంది. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. పోటీ ప్రధానంగా కమలం, హస్తం మధ్యనే అన్నట్టుగా సాగుతోంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీలు మారిన వారు కావటంతో ఓరుగల్లు ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి.
-దేశవేని భాస్కర్