Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతీర్థ్ విఠల్.. క్షేత్ర్ విఠల్

తీర్థ్ విఠల్.. క్షేత్ర్ విఠల్

“తీర్థ్ విఠల్, క్షేత్ర్ విఠల్;
దేవ విఠల్, దేవపూజా విఠల్;
మాతా విఠల్, పితా విఠల్;
బంధు విఠల్, గోత్ర్ విఠల్;
గురు విఠల్, గురుదేవతా విఠల్;
నిధాన్ విఠల్, నిరంతర విఠల్;
నామామణ్ విఠల్ సాపడ్ లా ;
మానోని కలికాల్ పాడ్ నాహి “

అర్థం
సకల తీర్థాలు పాండురంగ విఠలుడే, సకల క్షేత్రాలు పాండురంగ విఠలుడే;
సకల దేవుళ్లు పాండురంగ విఠలుడే, సకల దేవపూజలు పాండురంగ విఠలుడే;
తల్లి విఠలుడే, తండ్రి విఠలుడే;
బంధువు విఠలుడే, గోత్రం విఠలుడే;
గురువు విఠలుడే, గురుదేవతా విఠలుడే ;
మనసుకు నెమ్మది విఠలుడే, మనసులో నిరంతరం విఠలుడే;
నామదేవుడి మాట – సకలం విఠలుడే;
ఈ కలియుగంలో విఠలుడిని స్మరిస్తూ ఎలాంటి ఆపదల్లేకుండా మోక్షం పొందవచ్చు.

భారతీయ భాషలన్నిటిలో ఉన్న గొప్ప భజనల్లో ఒక వంద ఎంపిక చేస్తే ఈ మరాఠీ భజన కీర్తన అందులో ముందువరసలో ఉంటుంది.

మనకు తెలుగులో నగుమోము, ఎందరో మహానుభావులు, అదివో అల్లదివోలా మరాఠీలో ఇది. పేరుకు మరాఠీ కానీ – తీర్థ్ విఠల్ కాలగమనంలో భారతీయ భాషల్లో ఏ భాషవారికి ఆ భాష సొంతమయినదే అయ్యింది.

దాదాపు 800 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో సంత్ నామదేవ్ అంటే ఒక భక్తి ఉద్యమం. సంస్కృతంలో ఉన్న వేద పురాణాలు పండితులకు తప్ప సామాన్యులకు తెలియనివేళ వాటి సారాన్ని, వాటి ఉద్దేశాలను మామూలు జనం భాషలో వ్యాప్తి చేయడంలో నామదేవ్ కృషి అసామాన్యం. అలా 8 శతాబ్దాల క్రితం నామదేవ్ మరాఠీలో రచించి గానం చేసిన భజన కీర్తన ఇది. చివర రెండు పంక్తులు తప్ప మిగతా అంతా కొద్దిగా హిందీ అర్థమయ్యే ఏ భారతీయుడికయినా సులభంగా అర్థమవుతుంది.

ఈ దేశ స్వాతంత్ర్యానికి మరాఠా వీరులు చేసిన నిరుపమానమైన సేవలు పులకింతకే పులకింతలు పుట్టించేవి.

హిందూ ధార్మిక చైతన్యానికి మరాఠీ గడ్డ నెత్తిన పెట్టుకున్న గణపతి భక్తి భక్తికే పులకింతలు పుట్టించేది.

భారతీయ భజన సంప్రదాయానికి ఓనమాలు దిద్దిన మరాఠీ అభంగాలు పేరుకు తగ్గట్టు అన్ని భాషల్లో అభంగ మృదంగ తరంగమై మారుమోగడం జనసామాన్య నామ గానానికే పులకింతలు పుట్టించేవి.

తెలుగులో విఠలా! విఠలా! జయపాండురంగ విఠలా! ప్రఖ్యాత గీతానికి దారిచూపిన దీపమిదే.
సకల సంస్కృత ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పుక్కిట పట్టిన అన్నమయ్య జనం భాషలో పదాలు అల్లడానికి అప్పటికి కన్నడసీమలో స్థిరపడ్డ ఈ భజన సంప్రదాయమే కారణమని పుట్టపర్తి నారాయణాచార్యులు త్రిపుటి వ్యాసాల్లో నిరూపించారు.

“తన కాలంలో సాటి కవుల్లా అన్నమయ్య కూడా ప్రబంధ పద్య కావ్యాలు రాస్తూ కూర్చుని ఉంటే తెలుగు భాషకు ఉపయోగం ఉండేదో? లేదో? కానీ…ఆయన పద సాహిత్యాన్ని భుజానికెత్తుకోవడం తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అప్పటికే జనం నోళ్ళల్లో నానుతున్న మరాఠీ, కన్నడ అభంగాలు, భజనలు అన్నమయ్యను బాగా ప్రభావితం చేశాయి” అని పుట్టపర్తివారు వివరించారు.

మొత్తంగా కర్ణాటక సంగీతాన్నే మరాఠీ భజన సంప్రదాయం ఎంతగా ప్రభావితం చేసిందో సంగీతజ్ఞుల నడిగితే చెప్తారు. ఆ మాటకొస్తే మరాఠీ , కన్నడ భజన పద్ధతులు భారతీయ భాషలన్నిటిలో భజనలను ప్రభావితం చేశాయి.

చిన్న చిన్న పదాలు, సులభంగా అర్ధమయ్యే అల్లిక, సమూహం చప్పట్లు కొడుతూ వంత పాడడానికి వీలుగా ప్రతి పంక్తి చివర విఠలనామం వీటి ప్రత్యేకత. సంగీతం తెలియని వారు కూడా మైమరచి పాడుకోవచ్చు. బాగా సంగీతం తెలిసినవారు రాగ తాళ లయలతో నాదానుసంధానం చేసుకోవచ్చు.

భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రఖ్యాత సంగీత విదుషీమణి అరుణా సాయి రామ్ లాంటి వారు ఈ తీర్థ్ విఠల్ మాధుర్యాన్ని ప్రపంచానికి పంచారు.

నిజానికి తెలుగువాళ్లుగా మనం తెలుగు భజనల్లో దేవుడిపేరు వినిపిస్తే నోరారా పలకడానికి ఎక్కడ పుణ్యమొచ్చి ఒళ్ళో వాలుతుందోనని సంకోచిస్తాము కానీ – మరాఠీ , ఉత్తర భారతీయులు తీర్థ విఠల్ వినపడగానే చప్పట్లు కొడుతూ , తలలు ఊపుతూ విఠలనామస్మరణ చేస్తారు. మన ప్రయత్నం లేకుండానే విఠలుడి వెంట తీసుకెళ్లే భజన ఇది. ఈ రోజుల్లో గూగుల్లో, యూ ట్యూబులో ఉంటేనే ఏదయినా ఉన్నట్లు. అదృష్టం కొద్దీ ఈ తీర్థ్ విఠల్ అన్ని డిజిటల్ వేదికల్లో ఉంది.

వినాలనుకునేవారిని విఠలుడు, నామదేవుడు కూడా ఆపలేడు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్