Monday, May 20, 2024
HomeTrending NewsSC, ST, BC లను కాంగ్రెస్ విస్మరిస్తోంది - ప్రధాని మోడీ

SC, ST, BC లను కాంగ్రెస్ విస్మరిస్తోంది – ప్రధాని మోడీ

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి బుధవారం వేములవాడ, వరంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలను దుయ్యబట్టారు. ఎన్డీయే గెలుపు మొదటి మూడు విడతల్లోనే స్పష్టమైందని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు  వచ్చాయో వెతుక్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయానికి ప్రతీక.. వరంగల్ చారిత్రాత్మకమైన సీటు అని కొనియాడారు. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్ళీ బీజేపీ రావాలన్నారు.

10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎలాంటి పాపలు చేసిందో ప్రజలు మరిచి పోలేదని గుర్తు చేశారు. కుంభకోణాలు.. బాంబ్ బ్లాస్టింగ్స్ కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు. కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. ఈ దేశాన్ని అలాంటి వారి చేతుల్లో పెడదామా..? అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న కాంగ్రెస్ నాయకులు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కోతలు పెరిగాయన్నారు.

కాంగ్రెస్ నేతల ఇళ్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదన్నారు. చట్టాన్ని సవరించైనా సరే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తుందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ SC, ST, BC లను విస్మరిస్తుందని ఆరోపించారు. దళిత సామాజికవర్గానికి చెందిన రామ్‎నాథ్ కొవిద్‎ను.. రెండోసారి ఆదివాసీ‎ మహిలని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే చెప్పారు.

అంతకు ముందు సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోడీ  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో కోడె మొక్కుల‌ను ప్ర‌ధాని తీర్చుకున్నారు. ప్ర‌ధానికి వేద పండితులు ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు. ఆలయమంతా కలియతిరిగి.. పరిశీలించారు. మోడీ రాకతో ఆలయంవద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అనంతరం కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అడ్రస్‌ కూడా కనిపించడం లేదన్నారు.

బీజేపీ దేశానికి ప్రాధ్యానత ఇస్తుంటే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే… ఆ పార్టీల మధ్య  తేడా ఏమీ లేదని ఆరోపించారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ.. తెరవెనుక సిండికేట్‌గా మారుతారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్‌… అధికారంలోకి వచ్చాక దానిపై ఎలాంటి దర్యాప్తు చేయట్లేదంటూ మోడీ మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్ మీదే చర్చ జరుగుతోందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్‌ ద్వారా వచ్చే వసూళ్లు.. ట్రిపుల్ ఆర్ సినిమా వసూళ్లను మించిపోయాయన్నారు. తెలంగాణలోని ఆర్‌ లూటీ చేసి.. ఢిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఫొటో దిగారు. దానిని తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. ఆయన వరంగల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సందర్భంగా మార్గమధ్యంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఆనందించారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మోదీ ట్వీట్ చేస్తూ ‘వరంగల్‌లో ప్రచార ర్యాలీకి వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను’ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

వరంగల్ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ‘వరంగల్‌లో జరిగిన ర్యాలీలో మా తమ్ముడు మంద కృష్ణ మాదిగ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి దక్కాల్సిన అవకాశం, గౌరవం లేకుండా పోయాయి. మాదిగ సామాజికవర్గ సంక్షేమం కోసం బీజేపీ ఎప్పుడూ కృషి చేస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్