Friday, September 20, 2024
HomeTrending Newsపాలస్తీనా ఆందోళనలు...అమెరికాకు ఉగ్ర ముప్పు

పాలస్తీనా ఆందోళనలు…అమెరికాకు ఉగ్ర ముప్పు

ఇజ్రాయల్ – పాలస్తీనా అల్లర్లు క్రమంగా కొత్త రూపు దాలుస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 17న కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించాయి. గాజాలో తక్షణం కాల్పులు విరమించాలని, ఇజ్రాయెల్‌తో పాటు గాజాపై యుద్ధానికి మద్దతు ఇచ్చిన కంపెనీలతో యూనివర్సిటీలు సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు అమెరికా వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటైన మెట్‌ గాలాకు కూడా ఈ నిరసనల సెగ తాకింది.

న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మే 6వ తేదీన ఈ ఫ్యాషన్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులు అక్కడ అలజడి సృష్టించారు. పాలస్తీన అనుకూల నిరసనలతో ఈ వెంట్‌ జరుగుతున్న ప్రదేశంలో నిరసన చేపట్టారు. పాలస్తీనా జెండాలను చేతపట్టుకుని గాజా, పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేశారు. స్మోక్‌ బాంబులతో మెట్‌ గాలాకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు.

వీరి నిరసనలతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెట్‌ గాలాకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రముఖులు, ఇతరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈవెంట్‌ జరుగుతున్న ప్రదేశంలోని పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు తప్ప ఎవరినీ ఆ ప్రాంతంలోకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

అమెరికాలో ఇదే వరుసన పాలస్తీనా అనుకూల ఆందోళనలు కొనసాగితే…దేశ భద్రతకు ముప్పు అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అల్ ఖైదా తరహాలో మళ్ళీ దాడులు జరిగినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నాయి. అల్ ఖైదా తరహాలో ఇప్పుడు ఐసీస్(Islamic state of Iraq and Syria) ఆఫ్రికా, ఆసియా, గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది.

హిజ్బోల్లా, హమాస్ ఉగ్రవాదులను పెంచి పోషించింది ఐసిస్ నాయకత్వమే. సిరియా, ఇరాక్ కేంద్రంగా ముస్లిం దేశాల్లో ఇది పాగా వేస్తోంది. పాలస్తినాపై ఇజ్రాయల్ దాడులతో ఈ సంస్థ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అమెరికా దన్నుతోనే ఇజ్రాయల్ యుద్ధం చేస్తోందని ఆరోపిస్తోంది. గతంలో న్యూయార్క్ WTO భవనాల మీద దాడికి ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా వివరణ ఇస్తూ… ముస్లిం దేశాల్లో యుద్ధాలకు అమెరికా, దాని మిత్ర దేశాలే కారణమని ఆరోపించింది.

ఇప్పుడు అదే తరహాలో ఐసిస్ పాల్పడే అవకాశాలు బలంగా ఉన్నాయని అమెరికా అనుమానిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి త్వరగా ముగింపు పలకకపోతే పెను సంక్షోభం పొంచి ఉందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్