కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడూ ఏపనీ తానూ చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రెండు మూడు నెలల ముందు ఏ పథకం ప్రవేశ పెట్టలేదని గత 59 నెలల నుంచీ పేదల సంక్షేమం కోసమే పని చేశానని పేర్కొన్నారు. తనకు పేరు వస్తోందని చెప్పి ఈర్ష్యతో పెన్షన్‌ను అడ్డుకున్న దౌర్భాగ్యులు అంటూ విపక్షాలపై ధ్వజమెత్తారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేశామని, వివిధ పథకాలకోసం బటన్‌లు నొక్కి 2 నెలలైనా కూడా ఇప్పటికీ నిధులు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బస్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.
ఎన్నికలకు 3 నెలలు ఉండగానే కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారని… ప్రభుత్వాన్నైనా ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని కానీ 57 నెలలకే మీ జగన్ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని చూస్తున్నారంటూ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో చెప్పారు. వారు గొంతు పట్టుకుని పిసికేది జగన్ ప్రభుత్వాన్ని కాదని, అక్కచెల్లెమ్మల, అవ్వాతాతల, రైతన్నల గొంతు పట్టుకుని పిసికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలు కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం బిసిల సీటు అని, అందుకే ఈసారి ఇక్కడినుంచి ఆర్కేను తప్పించి బిసి సామాజికవర్గానికి చెందిన లావణ్యకు అవకాశం ఇచ్చామని, బీసీ అభ్యర్ధిపై డబ్బుల మూటలతో గెలవాలని పెద్దోళ్లంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.