Saturday, November 23, 2024
HomeTrending Newsరాజకీయ కోణంలోనే రైతు ఉద్యమం: కిషన్ రెడ్డి

రాజకీయ కోణంలోనే రైతు ఉద్యమం: కిషన్ రెడ్డి

రాజకీయ కోణంతో, స్వార్ధంతోనే కొన్ని రాజకీయ పార్టీలు, కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన కొన్ని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు జరక్కుండా ఆడుకున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.  వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు కావాలని స్వామినాథన్ చెప్పారని, శరద్ జోషి లాంటి వారు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారని కిషన్ రెడ్డి వివరించారు. దీనిలో భాగంగానే తాము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేసే సంస్కరణలు తీసుకు వస్తామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని అయన గుర్తు చేశారు. గిట్టుబాటు ధర లభించే చోట తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే వెసులుబాటు ఈ చట్టాల ద్వారా రైతులకు లభిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఈ విషయమై ఆందోళనలు కూడా చేశాయని అయన గుర్తు చేశారు.  జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో రెండో రోజు పర్యటిస్తున్న తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

తన లాంటి ఎందరో సాధారణ కార్యకర్తలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో బలహీనవర్గాలకు, మైనార్టీలకు, మహిళలకు అవకాశం ఇచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా సామాజిక న్యాయం పాటించారని వివరించారు.

మంత్రి వర్గ విస్తరణ తరువాత జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కొత్త మంత్రులను సభకు పరిచయం చేయాల్సి ఉందని, ఈ సంప్రదాయం పాటించ నీయకుండా విపక్షాలు అడ్డు పడ్డాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. “పార్లమెంటులో పరిచయం చేయనీయలేదు కాబట్టి మా మంత్రులు ప్రజా క్షేత్రం లోకి వెళ్లి వారికి వారు పరిచయం చేసుకుంటారు, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటారు”  అని మోడీ ఆ సందర్భంలో చెప్పారని అందుకే జన ఆశీర్వాద యాత్ర చేపట్టామని కిషన్ రెడ్డి వివరించారు.

అంతకుముందు కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. వేదం పండితులు ఆశీర్వచనం అందజేశారు.  అనంతరం తిరుపతి స్విమ్స్ లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అయన పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై, వ్యాక్సిన్ నిల్వలపై ఆరాతీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  తిరుపతి నుంచి విజయవాడ వెళ్లనున్న కిషన్ రెడ్డి అక్కడ బిజెపి కార్యకర్తలతోను, వివిధ రంగాల ప్రముఖులతోను సమావేశ మవుతారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు వెళతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్