ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో వైఎస్ఆర్సిపి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో మమేకమయ్యారని.. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా పరిపాలన అందించారని అన్నారు. జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సామాన్య మానవుడు ఆర్థికంగా ఎదిగేలా దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు
విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వం మారితే ఈ సంస్కరణాలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోనూ గడిచిన ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని…. ఈసారి కూడా అదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.
ప్రజలకు గుమ్మం ముందుకే పాలన తీసుకువచ్చామని, ఈ దిశలోనే వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల వాలంటీర్ వ్యవస్థను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
చంద్రబాబు అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తాడని, తనకు అధికారం లేనప్పుడు పనిగట్టుకుని అధికార పార్టీ పైనా, ప్రభుత్వం మీద బురదజల్లడం వాటినీ మరలా బూతద్దంలో చూపెట్టి విషప్రచారం చేయడం ఆయనకు వ్యసనంగా మారిందని మండిపడ్డారు. అందులో భాగంగా ఉన్నవి లేనివి కల్పించి ఎన్నికల సంఘానికి టీడీపీ తరఫున రోజుకో లేఖ రాస్తున్నారని ఎద్దేవా చేశారు
జూన్ 4 వరకూ అందరూ సంయమనం పాటించాలని బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీల నేతలంతా రిలాక్స్ మూడ్‌లో ఎవరికి వారు విదేశాలకు వెళ్లారు కాబట్టి.. ఆయా పార్టీల కేడర్ కూడా ఎన్నికల ఫలితాలొచ్చేదాకా రాజకీయాల్ని పక్కనబెట్టి కాస్త సంయమనం పాటించడం మంచిదని హితవు పలికారు. ఇకనైనా, ఈ దాడులు, అల్లర్లు ఆపాలని, సోషల్‌మీడియాలో కూడా అనవసరంగా ట్రోలింగ్‌లు పెట్ట వద్దని కోరారు. జూన్ 4 వరకూ అన్ని రాజకీయ పార్టీల కేడర్ సంయమనం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా సహకరించాలన్నారు