గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమ్ జోన్ ప్రమాద మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సందర్శకులంతా వివిధ రకాల క్రీడల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపై పైకప్పు కూలిపోవడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్ యజమాని యువ్‌రాజ్ సింగ్ సోలంకితోపాటు దాని మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం.. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
గేమ్ జోన్ లో భద్రత చర్యలు పాటించలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదం సంభవిస్తే తీసుకోవల్సిన ముందు జాగ్రత్త చర్యలపై గేమ్ జోన్ సిబ్బందికి కనీస అవగాహన లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మరోవైపు ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అగ్నిమాపక శకటం వచ్చిందని రాష్ట్ర హోం మంత్రి హర్ష సంఘ్వి చెప్పటం రాజకీయ దుమారానికి దారితీసింది. నిందితులను కాపాటేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చనిపోయిన వారే శరీరాలు గుర్తుపట్టలేని స్థితికి చేరటంతో DNA పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం రాత్రి ప్రమాదం జరుగగా ఆదివారం ఉదయం వరకు మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాద సమయంలో గాలి దుమారం లేవటంతో క్షణాల్లో అగ్ని కీలలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ఆదివారం ఉదయం పరిశీలించారు. అగ్రిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి చికిత్స అందించాలని ఆదేశించారు.
-దేశవేని భాస్కర్