ఇప్పుడున్న యువ కథానాయకులంతా తమ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూనే, ఆ కథలో .. తమ పాత్రలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా విష్వక్సేన్ డిఫరెంట్ జోనర్లలో .. డిఫరెంట్ కాన్సెప్టులను ట్రై చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. అలా ఆయన చేసిన సినిమాలలో ‘గామి’ .. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కి వస్తోంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన సినిమాలో, అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది కూడా.
ఈ కథ గోదావరి నేపథ్యంలోని లంకల గ్రామంలో మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఆకతాయిగా తిరిగే యువకుడే రత్నం. ఆ ఊళ్లో తమ పెత్తనం చెల్లాలనే పట్టుదలతో దొరసామి – నానాజీ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు కారాలు .. మిరియాలు నూరుతూ ఉంటారు. వాళ్లిద్దరినీ చాలా దగ్గరగా పరిశీలించిన రత్నం, వాళ్లని మించిన స్థాయికి ఎదగాలనుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? ఫలితంగా ఏవవుతుంది? అనేది కథ. విష్వక్ గోదావరి యాసపై పెద్దగా దృష్టిపెట్టకపోయినా, కొన్ని యాక్షన్ సీన్స్ .. ఎమోషన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.