Friday, November 22, 2024
HomeUncategorizedప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింపచేద్దాం: పవన్

ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింపచేద్దాం: పవన్

‘మనపై ప్రజలు ఎన్నో ఆశలతో… ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రయిక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాము’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్, ఎమెల్యేలు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ  జన సేన నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ శాతం కొత్తవారేనని, అందువల్ల సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన ఏర్పరచుకోవాలని…  నియమావళిని పాటిస్తూ, సంప్రదాయాలను గౌరవిస్తూ సభలో హుందాగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. “మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి. సభలో కొద్ది రోజుల కిందటే ప్రమాణం చేశాము. ఇక్కడి నుంచి తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టిపెట్టండి. ప్రభుత్వ శాఖలను, పాలనపరమైన విధివిధానాలను, నిబంధనలను, పథకాలను, వాటి అమలు తీరునీ, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా… లాంటి విషయాలను అధ్యయనం చేయాలి. ఆ తరవాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి” అంటూ హితవు పలికారు.

విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చని కానీ భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని అన్నారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడవద్దని,  ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు.

మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని, గతంలో జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని, ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టాలని ఆదేశించారు.

నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. మనం సభలో లేవనెత్తే అంశాలు, చర్చల్లో పాల్గొనేందుకు తగిన అధ్యయనం చేయాలి. మన నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతోపాటు వాటిని రాష్ట్ర స్థాయి కోణంలో కూడా సభలో చర్చించడం కూడా ముఖ్యం” అన్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ ఈరోజు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. సంధ్యాసమయంలోను వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు వారాహి దీక్షలో ఉంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్