Thursday, September 19, 2024
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల్లో ఎస్సి వర్గీకరణ.. సవాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో ఎస్సి వర్గీకరణ.. సవాళ్లు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ర్టాలకే ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల మీదనే కేంద్రీకృతం అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 34 లక్షల మంది మాదిగలు ఉండగా తెలంగాణలో 33 లక్షల మంది ఉన్నారు. ఏపి జనాభాలో 10 శాతం , తెలంగాణ జనాభాలో 16 శాతంగా మాదిగలున్నారు.

మొదటి నుంచి మాదిగలకు అండగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎపిలో అధికారంలో ఉన్నారు. మాదిగలకు న్యాయం చేసిందే తామని, టిడిపి హయంలోనే వర్గీరణ జరగిందని…మధ్యలో కోర్టు కేసులతో అడ్డంకులు ఏర్పడినా సుప్రింకోర్ట్ న్యాయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే అమలు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. జనాభా దృష్ట్యా మాల, మాదిగ జనాభాలో రాష్ట్రంలో స్వల్ప తేడానే ఉన్నా మాల సామాజికవర్గం కొంత అంగ, అర్థబలం కలిగి ఉంది. దీంతో మాలలు ఉద్యమ బాట పట్టే అవకాశం అధికంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా పేరు గడిస్తామని సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన రోజే శాసనసభ వేదికగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాల నాయకుల ఆధిపత్యం అధికంగా ఉంటుంది. వారు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. పార్టీ అధిష్టానం వద్ద తిరుగులేని నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి తలచుకుంటే వర్గీకరణ నల్లేరు మీద నడకే అని మాదిగ మేధావులు చర్చించుకుంటున్నారు.

తెలంగాణలో మాదిగ జనాభా అధికంగా ఉన్న దృష్ట్యా ఓటు బ్యాంకు కోణంలో కాంగ్రెస్ కార్యాచరణకు దిగే అవకాశం ఉంది. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సిఎం అమెరికా నుంచి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల లోపే అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్‌ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధి పొందుతున్నారంటూ మాదిగలు పోరుబాట పట్టడంతో 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదనను సమర్థిస్తూ 1996లో నివేదిక కమిషన్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా విభజించారు. 2000లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది.

రాష్ర్టాలకు వర్గీకరణ అధికారం లేదంటూ సుప్రీంకోర్టు 2004లో కొట్టివేసింది. అనంతరం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఉషామెహ్రా కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ర్టాలు కులాల వర్గీకరణ చేపట్టవచ్చని కమిషన్‌ సిఫారసు చేసింది. అది అమలుకు నోచుకోలేదు. అవేవీ లేకుండానే ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

తెలంగాణలో అధికారికంగా గుర్తింపు పొందిన ఎస్సీ ఉపకులాల సంఖ్య 59. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ 12 కులాలకి 1శాతం కోటా ఇచ్చారు. వాటిని అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారు. ‘బీ’ గ్రూపులో మాదిగలతో పాటు మొత్తం 18 కులాలను చేర్చి 7% కోటా కెతాయిన్చారు, ‘సీ’లో మాలలతో పాటు 25 ఉపకులాలను చేర్చారు.వారికి 6% కోటా. ‘డీ’లో ఆది ఆంధ్రులతోపాటు మొత్తం 4 కులాలను చేర్చి, 1% కోటా నిర్ణయించారు. ప్రస్తుతం ఇందులో కొన్ని కులాలు రాష్ట్రంలోనే లేవని దళిత మేధావులు చెప్తున్నారు.

ఇప్పటివరకు జనాభా లెకల్లో ఎస్సీ, ఎస్టీలుగా గణిస్తున్నారే తప్ప ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై గణాంకాలు లేవు. ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలంటే సుప్రీంతీర్పు ప్రకారం ముందుగా ఎస్సీ జాబితాలోని కులాల లెక్క తీయాల్సి ఉంటుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్