ఒడిషాకు చెందిన సుప్రసిద్ధ వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాధ మహాపాత్ర కరోనాతో మృతి చెందారు. అయన వయసు 78 సంవత్సరాలు. కోవిడ్ బారిన పడి ఒడిషాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మహాపాత్ర నేటి సాయంత్రం మరణించారు.
పూరిలో జన్మించిన రఘునాధ 8వ తరగతి వరకూ చదువుకున్నారు. వాస్తు, శిల్పం, చేతికళలు రంగాల్లో అద్భుత ప్రతిభ కరబరిచి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. భారత ప్రభుత్వం ఆయన్ను 1975లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2013లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. భారత విదేశాంగ శాఖ 2000 సంవత్సరంలో ఆయన్ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) సభ్యునిగా నామినేట్ చేసింది. 2018లో రఘునాధ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
రఘునాధ మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు, అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్కృతి, కళా రంగాలు, వాస్తు శిల్పం లో అయన ప్రతిభ చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఒడిషా ఖ్యాతిని, వారసత్వ సంపదని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడంలో మహాపాత్ర చేసిన కృషి అమూల్యమైనదని నవీన్ పట్నాయక్ అన్నారు.