Saturday, November 23, 2024
HomeTrending Newsదిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువ

దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువ

‘‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పడిపోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పథకాలెక్కువ. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేపడుతున్న 4వ రోజు పాదయాత్రకు అశేష ప్రజానీకం తరలి వచ్చారు. చిలుకూరు చౌరస్తా నుండి మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మొయినాబాద్ చేరుకుంది. అడుగడుగునా వేలాది మంది తరలివచ్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి స్వాగతం పలికారు.
కార్యకర్తల జోష్ చెప్పనక్కర్లేదు. కాషాయా టోపీలు, జెండాలు ధరించి కదం తొక్కారు. పిల్లలు, మహిళలు, వృద్దులనే తేడా లేకుండా జనం తరలిరావడంతో మొయినాబాద్ ప్రాంతమంతా జనసంద్రమైంది. మొయినాబాద్ చౌరస్తా నుండి దాదాపు 3 కి.మీల పరిధి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. బండి సంజయ్ ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు పలువురు మహిళలు, యువకులు చుట్టుపక్కలనున్న భవనాలు ఎక్కి చేతులూపుతూ సంఘీభావం తెలిపారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ అశేష జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే ముఖ్యాంశాలు…
ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సందోహానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మహా నగరానికి నీళ్లు, పాలు, కూరగాయలు, పండ్లు సహా నిత్యావసర వస్తువులన్నీ అందిస్తున్న రంగారెడ్డి జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చిలుకురు బాలాజీ స్వామిని వేడుకున్న.
ఇప్పటికే ఎంఐఎం బాక్స్ బద్దలైనయ్. ఈ జన సందోహాన్ని చూసి టీఆర్ఎస్ బాక్సులు కూడా బద్దలవుతున్నయ్.
పాతబస్తీకి వచ్చి సభ పెట్టే దమ్ముందా అని నరేంద్రమోదీకి ఓవైసీ సవాల్ చేస్తే భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద సభ పెట్టి బీజేపీ దమ్ము ఏందో చూపించినం. మళ్లీ సవాల్ చేస్తే….దారుస్సలాం వచ్చి సభ నిర్వహించి తీరుతాం. బీజేపీ సత్తా ఏందో చూపిస్తం. 2023లో బీజేపీ అధికారంలోకొస్తే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దే మళ్లీ తొలిసభ నిర్వహించి తీరుతాం.


తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది చనిపోయిండ్రు. ఉరితాళ్లను ఉయ్యాలలుగా చేసుకుని బలిదానం చేసుకుండ్రు. ఈ జిల్లాకు చెందిన యాదిరెడ్డి, సరిత, మహేశ్ గౌడ్ బలిదానం చేసిండ్రు. వీళ్లందరికీ అగ్గిపెట్టె, ఉరితాళ్లు దొరికినయ్ కానీ…..కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి, ఆ పార్టీ నాయకులకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదట.. అమరవీరుల సంఖ్యను 600 కు తగ్గించిన క్రుతజ్ఝతాహీనుడు కేసీఆర్.
అమరవీరుల త్యాగాల స్పూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తున్నం. కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకే ఈ యాత్ర చేస్తున్నం.
111 జీవోను రద్దు చేస్తానని మాట తప్పిన సీఎం అసలు ఈ జీవోపై ఆయన వైఖరేందో చెప్పాలి. ఈ జీవో పరిధిలోనే కేసీఆర్ కు, ఆయన కొడుకుకు, కూతురుకు, అల్లుడుకు ఫాంహౌజ్ లున్నయ్. ఆ పార్టీ నాయకులు రైతుల నుండి అతి తక్కువ ధరకు వేల ఎకరాలు కొని వేల కోట్లు దండుకుంటుండ్రు.


పేదలకు, దళితులకు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మాత్రం ఉండటానికి ఇండ్లు ఇస్తలేడు. కేంద్రం 70 వేల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలకు మంజూరు చేస్తే నిర్మించకుండా కేసీఆర్ పిట్టకథలు చెబుతుండు. కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా…రాష్ట్రంలో ఇస్తున్న ఉచిత బియ్యం, కరోనా వ్యాక్సిన్, రైతు వేదికలు, స్మశానవాటికలు, రోడ్లు సహా మౌలిక సదుపాయాల నిధులన్నీ కేంద్రానివే.
రంగారెడ్డి జిల్లాకు మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు వంటి వాటి కోసం రూ.1040 కోట్లు కేంద్రం ఇఛ్చింది. నేనొక్కటే అడుగుతున్న. ఈ జిల్లాకు కేసీఆర్ ఏం జేసిండో చెప్పాలి.


ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. పోయే ప్రభుత్వానికి పథకాలెక్కువ. అసలు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకే డబ్బుల్లేని ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్న ప్రభుత్వం, దళిత బంధు వంటి వాటి అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోంది.
12 శాతం ఓట్ల కోసం 80 శాతమున్న హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే బరాబర్ కొట్లాడతాం. అడ్డుకుని తీరతం.
సర్దార్ స్పూర్తితో నిజాం పాలననుండి విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీ మోకరిల్లితే……తెలంగాణ ప్రజలను పీల్చిపిప్పిచేసి, ఆఘాయిత్యాలకు పాల్పడ్డ నిజాంరాజుకు కేసీఆర్ మోకరిల్లుండు. పటేల్ పాలన కావాలా? నిజాం పాలన కావాలా? ప్రజలు ఆలోచించాలి.
తెలంగాణ తల్లి కేసీఆర్ గడీల్లో బందీ అయి విలపిస్తోంది. భారత్ మాతాకీ జై అంటూ కదిలివచ్చి విముక్తి కల్పించాలని ఘోషిస్తోంది. అందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కేసీఆర్ సర్కార్ ను కూకటి వేళ్లతో పెకిలించి వేద్దాం.


కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుతున్నా. దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అవకాశమిస్తే ‘శక్తివంతమైన తెలంగాణ’ను నిర్మించి తీరుతామని ఈ సభా ముఖంగా హామీ ఇస్తున్నానని బండి సంజయ్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్