హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ అన్నారు. కార్మిక బంధువులు గెలవాలా, కార్మిక ద్రోహులు గెలవాలా ఆలోచించండన్నారు.
జమ్మికుంటలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో తెరాసలో చేరిన సీపీఐ నేత కాయిత లింగారెడ్డి, టీడీపీ నేత అప్పాల మధు, ఏఐటీయూసీ నేత దమ్ముల రామ్మూర్తి. వందలాది మంది కార్యకర్తలు. గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్.
కేసీఆర్ గెలిచాక రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం జలాలు, కడుపునిండా ఉచిత కరెంట్ వచ్చిందని, బీజేపీ వచ్చాక మార్కెట్ యార్డులు రద్దు, డీజీల్ ధరల పెంపు రైతులపై భారం పెంచారన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి కరెంట్ భారం పెంచాలని చూస్తున్నారు. బీజేపీ వాళ్లు కరెంట్ లెక్కలు వేస్తుంటే.. కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. రైతు బంధువులెవరో, రైతు ద్రోహులెవరో ఆలోచించి ఎటువైపు ఉండాలో ఆలోచించండి. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నందున 4 వేల ఇల్లు మంజురయ్యాయి. మిగతా చోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకుంటే హుజురాబాద్ లో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఇండ్లు కట్టగలడా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎంపీగా బండి సంజయ్ చేయని పనులు.. అదే పార్టీ నుంచి ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేయగలడన్నారు.
బీజేపీవాళ్లు కుట్టుమిషన్లు, కుంకుమబరిణిలు, గోడగడియారాలు, గొడుగులు, బొట్టుబిల్లలు ఇస్తారట. ఇక్కడ పంచుడే పంచుడు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ పంచని ఈటల.. ఇప్పుడెందుకు పంచుతున్నాడు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వపథకాల గురించి చెప్పేటోడు.. ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేకనే.. ఇవన్నీ పంచుతున్నాడు. కాషాయ జెండా చేతిలో పట్టుకుని .. ఎర్రజెండా డైలాగులు కొడితే ఎవరూ నమ్మరని హరీష్ రావు అన్నారు.
ఇక్కడ పోటీ రూపాయి విలువ చేసే బొట్టు బిల్లలకు, లక్ష రూపాయల కల్యాణ లక్ష్మి పథకానికి మధ్య పోటీ అని, 9 నెలల క్రితం దుబ్బాకలో గెలిచినాయన ఏం చేసాడు. ఆయన కూడా గెలవకముందు ఎన్నో చెప్పాడు. రైలు తెస్తా, అది తెస్తా అంటూ చెప్పిన ఆయన నోటికే మొక్కాలి… ఏవోవో చెప్పాడు. ఒక్కటీ రాలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీ బాండ్ పేపర్ రాయించి ఇచ్చాడు. రెండేళ్లైంది ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచి, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి బిజెపి దేశానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. ఆ పార్టీ ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లింలకు వ్యతిరేకమని, అటువంటి పార్టీలో ఈటల చేరిండన్నారు. చిన్న మనిషిగా ఉన్న ఈటలను కెసిఆర్ చాలా పెద్దగా చేసిండని,గెల్లు గెలిపిస్తే ఆయన పెద్దగా ఎదిగి మీకు విశేష సేవలందిస్తడని కొప్పుల వివరించారు. ఈటల ఒక వ్యక్తిగా వెళ్లిపోయిండు, ప్రజాప్రతినిధులు,నాయకులెవ్వరూ కూడా ఆయన వెంట లేరు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు,నాయకులంతా మన వెంటే ఉన్నారని మంత్రి ఈశ్వర్ చెప్పారు. బిజెపి పొరపాటున గెలిస్తే హూజూరాబాద్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్తుందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.