Saturday, November 23, 2024
HomeTrending Newsఆలయ భూమికి దేవుడే యజమాని

ఆలయ భూమికి దేవుడే యజమాని

పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు(మేనేజర్స్‌) మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డులలోని యజమాని, అనుభవదారును సూచించే గడులలో సంబంధిత దేవుడు/దేవత పేరు మాత్రమే ఉండాలని తెలిపింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున స్థానిక జిల్లా కలెక్టర్లును కానీ ఆలయాల ఆస్తులకు యజమానులుగా పేర్కొన రాదంది.

జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. దేవాలయాల భూములకు యజమానులుగా పూజారుల పేర్లను చేర్చడంపై అభ్యంతరం తెలుపుతూ, వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రెండు నోటిఫికేశన్లను జారీచేసింది. పూజారుల పేర్ల స్థానంలో స్థానిక జిల్లా కలెక్టర్లను చేర్చాలని తెలిపింది. అయితే, ఈ నోటిఫికేషన్లను మధ్యప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేయడంతో ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఆలయాల భూముల అక్రమ విక్రయాలను నిరోధించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపింది. కేసు విచారించిన ద్విసభ్య ధర్మాసనం తరఫున జస్టిస్‌ హేమంత్‌ గుప్తా తీర్పు రాశారు. ఇటువంటి వివాదాలపైనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను, ప్రత్యేకించి గ్వాలియర్‌ చట్టాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

‘‘ఆలయ ఆస్తుల నిర్వహణను మాత్రమే పూజారికి అప్పగించారు. ఆయనకు భూమి సాగుదారు హోదా కల్పించలేదు కాబట్టి ఆయన కౌలుదారు కాదన్నది వాస్తవం. ఆలయ భూమి అనుభవదారు సంబంధిత ఆలయంలో ఉండే దేవుడు/దేవత మాత్రమే. సాగు కోసం సేవకులను లేదా మేనేజరును నియమించినప్పటికీ వారు భగవంతుడి తరఫునే విధులు నిర్వహిస్తారు. అందువల్ల అనుభవదారు పేరును సూచించే రెవెన్యూ రికార్డుల్లో మేనేజర్‌ లేదా పూజారి పేరును చేర్చనవసరంలేదు. అధికారిక రికార్డుల్లో యజమాని/అనుభవదారు స్థానంలో దేవుడి పేరుకు బదులుగా ఉన్న పూజారుల పేర్లను తొలగించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడం సబబే’’ అని తీర్పులో పేర్కొన్నారు. అదే సమయంలో పూజారుల పేర్లు తొలగించి ఆ స్థానంలో జిల్లా కలెక్టర్లను చేర్చాలన్న నిర్ణయాన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించలేదు. ఒకవేళ జిల్లా కలెక్టర్ల పేర్లను  మేనేజర్లుగా చేర్చాలంటే సంబంధిత ఆలయాలు రాష్ట్ర ప్రభుత్వానివై ఉంటేనే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్