Wednesday, May 8, 2024
HomeTrending Newsప్రజలను రెచ్చగొట్టొద్దు: అవంతి

ప్రజలను రెచ్చగొట్టొద్దు: అవంతి

మతాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసే చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. వినాయక చవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఎందుకు చెబుతుందని అయన ప్రశ్నించారు. ఇళ్ళల్లో చవితి వేడుకలు చేసుకోవచ్చని, దేవాలయాలకు కూడా వెళ్ళవచ్చని, ఊరేగింపుల వల్ల కరోనా పెరిగే ప్రమాదం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. భారీ ఊరేగింపులు, డిజేలు వద్దని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అది కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.  ప్రజలను రెచ్చగొట్టే ప్రయతం చేయవద్దని విపక్షాలకు అవంతి విజ్ఞప్తి చేశారు.

ఈనెల 27న పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు అవంతి వెల్లడించారు. సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల శాఖ ఆదాయం 120 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలకు పడిపోయిందని వివరించారు. క్రీడలు, పర్యాటక శాఖలో ఎనిమిదిమంది ఉద్యోగులు కరోనాతో  చనిపోయారని, వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఐదేళ్ళు దాటిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బదిలీకి అదేశాలిచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని 36 పర్యాటక హోటళ్ళను పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పారు. విదేశీ పర్యాటకుల కోసమే హోటళ్ళలో మద్యం పెట్టామన్నారు. పర్యాటక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు అవంతి పేర్కొన్నారు.

పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం కోసం 13 జిల్లాలను నాలుగు సర్క్యూట్ లుగా విభజిస్తామని, ఒక్కో సర్క్యూట్ కు మేనేజర్ ఉంటారని, సర్క్యూట్ ల వారీగా పర్యాటక ప్యాకేజీలను ప్రకటిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్