కాబుల్ వశం చేసుకొని పరిపాలనకు సిద్దమైన తాలిబన్లకు తిప్పలు తప్పటం లేదు. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించలేమని ఖతార్ తెగేసి చెప్పింది. తాలిబాన్ తో సహా అన్ని పార్టీలు సమ్మతిస్తేనే నిర్వహణ చేపడతామని ఖతార్ స్పష్టం చేసింది. ఐసిస్ , హక్కాని నెట్వర్క్ తదితర సంస్థలతో చర్చలు సఫలమైతేనే ఎయిర్ పోర్ట్ నిర్వహణ చేపడతామని ఖతర్ ఖరాఖండీగా చెప్పింది. వివిధ గ్రూపుల మధ్య అంతర్గత కలహాలతో సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ తాని వెల్లడించారు.
అయితే విమానాశ్రయ నిర్వహణపై చర్చలు కొనసాగుతున్నాయని ఖతర్ విదేశాంగ మంత్రి వివరించారు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించిన ఖతర్ విదేశాంగ మంత్రి అబ్దుల్ రెహమాన్ విదేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించాలని తాలిబన్లకు సూచించారు.
ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్ళిపోయాక అడపాదడపా ఖతర్, పాకిస్తాన్ విమానాలు తప్పితే వేరే దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చినా తమ దేశ పౌరుల్ని తీసుకెళ్లేందుకు కొన్ని విమానాలు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాక పోకలకు భద్రత కల్పిస్తేనే కొద్ది రోజుల తర్వాతనైనా మిగతా దేశాలు విమానాలు నడిపే అవకాశం ఉంది.
కాబుల్ విమానాశ్రయ నిర్వహణపై టర్కీ మక్కువతో ఉంది. మొదటి నుంచి తాలిబన్లకు ఖతర్ అండగా ఉంది. అమెరికాతో చర్చలు, తాలిబాన్ పెద్దలకు ఆశ్రయం ఇచ్చి అన్ని విధాల సహకరించిన ఖతర్ వైపే తాలిబన్లు మొగ్గు చూపెడుతున్నారు. ఖతర్ ముందుకు రాక పోతే టర్కీ నే కాబుల్ ఎయిర్ పోర్ట్ భాద్యతలు తీసుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయ రాకపోకలు లేకపోతే వాణిజ్యం కుంటుపడి దేశంలో అల్లకల్లోల వాతావరణం ఏర్పడుతుందని తాలిబన్లు ఆందోళన చెందుతున్నారు.