Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

ఉండవల్లిలో ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రులపై టిడిపి నేత సిహెచ్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ యత్నించారు. విషయం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు కూడా పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. బుద్ధా వెంకన్న నేతృత్వంలో జోగి రమేష్, వైసీపీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. టిడిపి కార్యకర్తలు జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. చంద్రబాబు ఇంటివైపు వెళ్ళకుండా జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు.

అయ్యన్నపాత్రుడు పరుష పదజాలంతో మాట్లాడుతుంటే చంద్రబాబు ఎందుకు వారించలేదని జోగి రమేష్ ప్రశ్నించారు. అయ్యన్న వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ను రాష్ట్రంలో తిరగనివ్వమని, తామే స్వయంగా రంగంలోకి దిగుతామని జోగి హెచ్చరించారు. రేపటి నుంచే తమ తడాఖా చూపిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాల ఆరాధ్య నేత సిఎం జగన్ పై  సభ్య సమాజం తలదించుకునేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని జోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును క్షమాపణ అడిగేందుకు, నిరసన తెలిపేందుకే ఇక్కడకు వస్తే తనపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయని వెల్లడించారు.

పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్