ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలనుంచి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 31 వరకూ రోజుకు ఎనిమిది వేల సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంటాయని అయన వెల్లడించారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని అయన విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ రెండో దశ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సర్వదర్శనం నిలిపివేసింది టిటిడి. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలతో ఈ నెల మొదటివారంలో సర్వదర్శనాన్ని పునరుద్ధరించింది. ప్రయోగాత్మకంగా రోజుకు రెండు వేల టికెట్లను విడుదల చేస్తూ, దర్శనాన్ని కేవలం చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేసింది. ఇతర జిల్లాలతోపాటు పరిసర రాష్ట్రాల భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనం టికెట్లను రోజుకు 8 వేల చొప్పున అందరికీ అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 25 నుంచి తిరుపతిలో ఇప్పటివరకూ ఇస్తున్న టోకెన్ పద్దతిని నిలిపివేస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.