Saturday, November 23, 2024
HomeTrending Newsఆఫ్ఘన్ లో తాలిబాన్... భారత్ ఏ వైపు?

ఆఫ్ఘన్ లో తాలిబాన్… భారత్ ఏ వైపు?

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన క్రమంగా సుస్థిరత వైపు సాగుతోంది. పంజ్ షీర్ స్వాధీనం కావటంతో అంతర్జాతీయ సహకారం, దేశంలో పాలనపై తాలిబన్లు దృష్టి సారించారు. ఆహార ధాన్యాల దిగుమతులు, ఖనిజ సంపద, డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా షరియా చట్టం అమలు చేస్తూనే ప్రజారంజక పాలన అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇతర దేశాలతో స్నేహంపై తాలిబన్లు ప్రత్యేక  శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని రష్యా, చైనా, పాకిస్థాన్ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల కాబూల్ లో సమావేశమైన మూడు దేశాల ప్రతినిధులు ఈ మేరకు తీర్మానం ఆమోదించారని రష్యా విదేశాంగ వర్గాలు మాస్కో లో వెల్లడించాయి. ఆఫ్ఘన్ లో శాంతి,సుస్థిరత నెలకొని అభివృద్ధి పథంలో సాగేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని మూడు దేశాలు నిర్ణయించాయి. తాలిబాన్లతో వాణిజ్య లావాదేవీలు కొలిక్కి వస్తే ఆఫ్ఘన్ లో అడుగు పెట్టాలని టర్కీ గోతి కాడ నక్కలా ఎదురు చూస్తోంది. అమెరికాతో ఉన్న వైరం దృష్ట్యా ఇరాన్ తాలిబాన్ల వైపే మొగ్గు చూపుతోంది. రష్యా, చైనా, పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు ప్రపంచ వేదికల్లో పాలుపంచుకునేందుకు ఉపయోగ పడుతుందని తాలిబన్లు భావిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి 76 వ సాధారణ సమావేశాలు న్యూయార్క్ లో రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాలు ఒకే వేదిక మీదకు వస్తున్నఈ తరుణంలో రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలు తాలిబాన్ల పట్ల తమ విధానాలు ప్రకటించటం గమనార్హం.  తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అమెరికా, యూరోప్ దేశాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

అమెరికాతో దోహా చర్చల్లో పాల్గొన్న తాలిబాన్ల ప్రతినిధి మహమ్మద్ సుహైల్ షహీన్ ఐక్యరాజ్యసమితిలో ఆఫ్ఘన్ రాయబారిగా వ్యవహరిస్తారని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ దేశాలు అవకాశం ఇస్తే యుఎన్ వేదికగా తమ విధానాలు వెల్లడిస్తామని తాలిబన్లు ఉత్సాహంగా ఉన్నారు.

తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం పాకిస్తాన్, ఖతార్ దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. యుఎన్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేలా ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని ఖతార్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తాలిబన్లను గుర్తించక పోవటం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ను ఏకాకిని చేయటమే అవుతుందని ఖతార్ పేర్కొంది. ఏకాకి అయిన ఆఫ్ఘన్లో పర్యవసానాలు వేచి చూసేందుకు ఆగటం సబబు కాదని ఖతార్ రాజు షేక్ తమీం బిన్ హమద అల్ తని అంటున్నారు. తాలిబన్లను గుర్తించాలని అవకాశం చిక్కినప్పుడల్లా పాకిస్తాన్ అమెరికాను కోరుతోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తే ఆఫ్ఘన్ లో హింస తగ్గే అవకాశం ఉందని ఖతార్, పాకిస్తాన్ లు వాదిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు తాలిబన్లను బహిష్కరించటం కన్నా కలుపుకు పోవటం ద్వారానే వారిలో మరింత మార్పుకు దోహదం చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఈ విషయంలో భారత్ కూడా తగిన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు కొంత తగ్గించుకోవచ్చు. కశ్మీర్ లో వేర్పాటువాద మూకల్ని కట్టడి చేసేందుకు తాలిబన్లతో సంబంధాలు అక్కరకు వస్తాయి. దౌత్య సంబంధాల్లో అమెరికాతో భారత్ అంటకాగితే లాభం కన్నా నష్టమే ఎక్కువ. చాబహార్ ఓడరేవు వ్యవహారంలో అదే జరిగింది. అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించటం, దానికి భారత్ మద్దతు ఇవ్వటంతో చాబహార్ అభివృద్ధి చైనా చేతుల్లోకి వెళ్ళింది.

 

ఇరాక్ పై అమెరికా దురాక్రమణ సమయంలో కూడా భారత్ విదేశాంగ విధానం విమర్శలకు దారితీసింది. ఇండియా చిరకాల మిత్రుడైన సద్దాం హుస్సేన్ కు సహకరించకుండా అమెరికా ఒత్తిడికి తలొగ్గటం చారిత్రక తప్పిదం అనవచ్చు. అమెరికాతో యుద్ధ సమయంలో ఇరాక్ విమానాలు ఇంధనం కోసం రాగా భారత్ నిరాకరించింది. భారత్ నిర్వాకానికి దౌత్య సంబంధాల మాట దేవుడు ఎరుగు ఇరాక్ ప్రజలు హతాశులయ్యారు. భారత్ పాక్ యుద్ధ సమయంలో ఇండియా వెన్నంటి ఉన్న సద్దాం హుస్సేన్ ధైర్యానికి భారతీయులు అప్పుడు జేజేలు పలికారు. 1975లో ఇందిరాగాంధి హయంలో ఇరాక్ లో భారత రాయబారిగా వ్యవహరించిన రమేష్ భండారి తన ఆత్మకథలో సద్దాం హుస్సేన్ భారత్ పట్ల స్నేహభావంతోనే ఉన్నారని వివరించారు. ఇండియాకు చమురు దిగుమతుల్లో ఎప్పుడు ఇబ్బందులు ఎదురైనా అడిగిన వెంటనే సద్దాం హుస్సేన్ సాయం చేసేవారని వెల్లడించారు. ఎన్నోసార్లు కోరిన తక్షణమే చమురు పంపి ఆ తర్వాత ఆర్ధిక లావాదేవీల గురించి మాట్లాడే సద్దాం గొప్ప మనసున్న నేత అని రమేష్ భండారి గుర్తు చేసుకున్నారు.

ఇలా మిత్ర దేశాలు దూరం అవుతుంటే భారత్ అమెరికాతో ఉరేగటం భవిష్యత్ భారతావనికి క్షేమం కాకపోవచ్చు. అగ్రరాజ్య ప్రభావం వీడి పొరుగు దేశాలతో సఖ్యత కోసం కృషి చేస్తేనే ప్రయోజనకారిగా ఉంటుంది.

– దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్