ఐపీఎల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులతో విజయం సాధించినా రన్ రేట్ తక్కువగా ఉండడంతో అవకాశం కోల్పోయింది. అబుదాబీ లోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో మనీష్ పాండే హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు.
ముంబై బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి స్టేడియం ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లింది. ప్లే ఆఫ్ చేరాలంటే 171 పరుగులతో గెలవాల్సిన పరిస్థితిలో అమీ తుమీ తేల్చుకునే రీతిలో వారి బ్యాటింగ్ సాగింది. ఇషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84; సూర్య కుమార్ 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేయడంతో నిర్ణీత 20 9వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్-4; రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో రెండు, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోగి దిగిన హైదరాబాద్ కూడా ఇన్నింగ్స్ ధాటిగానే మొదలుపెట్టింది. రన్ రేట్ 10 కొనసాగిస్తూ వారి ఆట సాగింది. మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తరువాత ఓపెనర్ జేసన్ రాయ్-32 ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ వర్మ 16 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్ తో 33; ప్రియం గార్గ్-29 పరుగులు చేశారు. వన్ డౌన్ లో వచ్చిన మనీష్ పాండే 41 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తన బ్యాటింగ్ తో క్రీడాభిమానులను అలరించిన ఇషాన్ కిషన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.