Tuesday, November 26, 2024

సార్ పోస్ట్!

World Post Day

సార్ పోస్ట్ ….. ఈ మాట వింటుంటే కలిగే ఆనందానికి రెండు రెట్ల ఆనందం కలుగుతుంది పోస్ట్ మ్యాన్ చేతి నుంచి అందుకునే ఉత్తరంతో. ఈ ఆనందాన్ని లెక్కలేనన్నిసార్లు పొందిన రోజులున్నాయి. ఇప్పటికీ నెలకు ఓ మూడు నాలుగు సార్లయినా నాకు పోస్ట్ వస్తుంటుంది. కానీ పోస్ట్ అనే గొంతు వినిపించదు. కారణం అతను గేట్ దగ్గరే వాచ్ మాన్ కి ఇచ్చేసిపోతాడు.

మద్రాసులో ఉన్నరోజుల్లో
ఎన్నో ఉత్తరాలు
ఎన్నెన్నో ఉత్తరాలు
నేనందుకున్న ఉత్తరాలెన్నో
ఉన్నాయి
ఒక్కొక్క ఉత్తరంతో
ఒక్కో అనుభూతి!

చలంగారి నుంచి అందుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. అవి పోస్టుకార్డులే కావచ్చు, అందులో ఉన్నవి మూడు నాలుగు వాక్యాలే కావచ్చు…అవి చదువుతుంటే చలంగారిని ప్రత్యక్షంగా చూసినంత ఆనందం.

సంజీవదేవ్ గారి నుంచి కవర్ అందుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. కారణం, ఆయన ఉల్లిపొరలాంటి పల్చటి తెల్లటి కాగితాలపై అందమైన దస్తూరీతో రాసిన విషయాలతోపాటు ఓ పెయింటింగ్ తప్పనిసరిగా పంపడం. ఎంతానందం వేసాదో చెప్పలేను. కలం స్నేహితుల నుంచి వచ్చిన ఉత్తరాల తీరు వేరు. మా ఆవిడ నుంచి, కొందరు మిత్రుల నుంచీ ఇలా ఎన్ని ఉత్తరాలో….మరచిపోలేని రోజులవి! కొందరి నుంచి ఉత్తరాలు నేను లెక్కలేసుకున్న రోజున రాకపోతే ఓ రకమైన బాధ కలిగేది. అసహనం. నిన్నటి వరకూ దేవుడిలా కన్పించిన పోస్టుమ్యాన్ ఉత్తరాల్లేవన్నప్పుడు విలన్ లా కనిపించేవాడు. అలాగే టైముకి ఉత్తరాలు రాయనివారిపైనా కోపం వచ్చేది.

అటువంటి పోస్టులను అందుకోవడం అనేది తపాలా శాఖ సేవలతోనేగా. తమ సేవలకు గుర్తు చేస్తూ సంబంధిత శాఖ ఓ రోజుని జరుపుకోవడం అనేది అక్టోబర్ తొమ్మిదో తేదీన. ప్రపంచ పోస్టల్ డే, జాతీయ పోస్టల్ డే …ఈ రెండు దినోత్సవాలూ ఇవాళే జరుపుకోవడం విశేషం. ఈ దినోత్సవాలు పురస్కరించుకుని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని పించింది.

ప్రపంచ తపాలా దినోత్సవాన్ని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రకటించింది. ఈ యూనియన్ 1874లో స్విట్జర్లాండులో ఏర్పాటైంది. ఇందులో భారతదేశంకూడా సభ్యత్వం కలిగి ఉంది. 1969లో టోక్యోలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశం జరిగినప్పుడు ప్రతి ఏటా తపాలా దినోత్సవం జరపాలని ఓ తీర్మానం చేశారు. తపాలా శాఖ సేవల గురించీ, ఆ సేవలను కొనియాడే రీతిలో సంబంధిత యూనియన్ కార్యకలాపాలను ప్రజలకు వివరించడానికే పోస్టల్ డే జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.

మన దేశంలో 1764లో తపాలా శాఖ ఏర్పాటైంది. స్వాతంత్యం పొందిన 1947 ఆగస్ట్ నాటికి దేశంలో 23 వేల తపాలా కార్యాలయాలు ఉండేవి. ఇప్పుడు లక్షన్నరకుపైగా పోస్టాఫీసులున్నాయి.World Postal Dayప్రపంచంలోనే ఎక్కువ పోస్టాఫీసులు ఉన్న దేశం మన భారత దేశం. లక్షరాదిమంది సిబ్బందితో నడుస్తున్న తపాలా శాఖ సేవలు గణనీయం. మన దేశంలో తపాలా వారోత్సవాలు అక్టోబర్ 9 నుంచి 15 వరకూ జరుపుకుంటారు.

భారత దేశంలో పోస్టల్ స్టాంప్స్ వాడకం 1852లో మొదటిసారిగా జరిగింది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటర్ (సింధ్ ప్రావిన్స్) సర్ బార్ ట్లే ఫ్రెరె పర్యవేక్షణలో ఇది సింధ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోస్టల్ స్టాంపుపై మొట్టమొదటిసారిగా చంద్రగుప్త మౌర్యుడి చిత్రాన్ని పోస్టల్ స్టాంపుగా ముద్రించారు. ఇతను ఆధునిక భారత దేశంలో మొట్టమొదటి భారతీయ చక్రవర్తి. స్వాతంత్ర్యం తర్వాత 1947 నవంబర్ 21వ తేదీన తొలి పోస్టల్ స్టాంప్ ముద్రించారు. జాతీయ పతాక చిత్రంతో ఈ స్టాంప్ ముద్రించారు. మరుసటి ఏడాది అనగా 1948లో మొదటిసారిగా గాంధీజీ చిత్రంతో స్టాంపులు వెలువడ్డాయి.

మన దేశంలో సముద్ర మట్టం నుంచి 15,500 అడుగుల ఎత్తున హిక్కిం అనే ప్రదేశాన ఓ పోస్టాఫీస్ ఉంది. ఈ ఊళ్ళో నూట యాబైమంది పల్లెవాసులున్నారు. దీనిని 1983లో ప్రారంభించారు. ఇక్కడ పని చేసే పోస్ట్ మాస్టరుకి ఇదే నివాసంకూడా. ఏడాదిలో ఆరు నెలలు మూసే ఉంటుంది. అంటే ఆరు నెలలు పని చేస్తుంది. అందుకు కారణం చలి ఎక్కువగా ఉండటమే. ఇద్దరు పోస్ట్ మ్యాన్ లు ఉత్తరాలు బట్వాడా చేస్తుంటారు. హిక్కిం నుంచి కాజా వరకూ ఇక్కడి పోస్టల్ సేవలు కొనసాగుతాయి.

 

1894లో అంతర్జాతీయ స్థాయిలో రంగుల పోస్టల్ స్టాంపుల పోటీలు నిర్వహించినప్పుడు కొచ్చిన్ స్టాంప్సుకి ద్వితీయ స్థానం దక్కింది.

భారతీయ ఆర్మీ పోస్టాఫీసులకు సంబంధించిన పోస్టల్ ఇండెక్స్ నెంబర్ తొమ్మిదితోనే మొదలవుతాయి.

శ్రీనగర్ పరిధిలోని దాల్ లేక్ (దాల్ సరస్సు) లో 2011లో ఓ పోస్టాఫీస్ ప్రారంభించారు.World Postal Day ఇది నీటిపై తేలియాడే పోస్టాఫీసుగా చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచంలో మరెక్కడా ఫ్లోటింగ్ పోస్టాఫీసు లేదు.

అంటార్కిటికాలో ఓ పోస్టాఫీసు పేరు దక్షిణ గంగోత్రీ పోస్టాఫీసు. భారత దేశం వెలుపల ఉన్న ఈ భారత తపాలా శాఖ కార్యాలయాన్ని 1983లో ప్రారంభించారు.

న్యూడిల్లీలోని శాస్త్రీ భవన్లో ఉన్న పోస్టాఫీసులో పని చేస్తున్న వారందరూ మహిళలే.

పోస్టల్ శాఖలో పిన్‌కోడ్ అంటే తపాలా సూచిక సంఖ్య విధానం 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టారు. ఇది ఆరు అంకెలతో కూడినది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తంమీద ఎనిమిది తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది. పిన్‌కోడ్ లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల ప్రాంతాన్ని, రెండవ అంకె ఉప-ప్రాంతాన్ని, మూడవ అంకె జిల్లాను, ఆఖరి మూడు అంకెలు వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను సూచిస్తాయి. దేశవ్యాప్తంగా మైత్తం 19,101 పిన్ కోడ్లు ఉన్నాయి.

ఇదండీ పోస్టుకు సంబంధించిన కొన్ని సంగతులు!
అయితే ఇటీవల చవిచూసిన చేదు అనుభవంతో ఈ కథనాన్ని ముగిస్తాను….

మద్రాసులో ఉంటున్న ప్రఖ్యాత రచయిత, విమర్శకులు వి.ఎ.కె. రంగారావుగారు రాసిన ఓ ఉత్తరానికి జవాబు రాస్తూ ఓ ఎన్వలప్ మేముంటున్న పక్కవీధి మొదట్లో ఓ స్తంభానికి వేలాడుతున్న పోస్ట్ బాక్సులో వేసాను. ఆ ఉత్తరం మొన్నటివరకూ కూడా ఆయనకు అందలేదు. తీరా వాకబు చేయగా తెలిసిందేమిటంటే ఆ పోస్ట్ బాక్సుని ఓపెన్ చేసేవారే లేరని. మరెందుకు ఆ పోస్ట్ బాక్స్ అక్కడ వేలాడదీశారో తెలీలేదు.

– యామిజాల జగదీశ్

Also Read:

కాఫీకీ ఓ దినోత్సవం

Also Read:

కాబోయే అయ్యవార్ల హై టెక్ కాపీయింగ్

Also Read:

వ్రాయనవసరం లేని కోల్గెట్ దంత వేదాంతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్