Saturday, July 27, 2024
Homeసినిమాబెంగాల్ దర్శకుడు తీసిన పంజాబ్ వీరుడి గాథ

బెంగాల్ దర్శకుడు తీసిన పంజాబ్ వీరుడి గాథ

Movie Review: Udham Singh:
రివొల్యూషన్ వేరు , టెర్రరిజమ్ వేరు..

తిరుగుబాటు ..ఉగ్రవాదం ఒకటి కాదు..
ప్రశ్నించడం, నిరసించడం..విద్రోహం కావు..
అవి ప్రజల హక్కు..
ఉరికంబాన్ని ముద్దాడే ముందు భగత్ సింగ్ చెప్పిందే ఇది.
దశాబ్దాలు గడిచాయి.
దేశానికి స్వాతంత్ర్యమొచ్చింది.
ప్రశ్న ఇప్పటికీ ద్రోహమే..
అధికారానికి ఎదురెళ్తే ఇప్పటికీ అణచివేతే..
అప్పుడు రౌలట్ చట్టం..
ఇప్పుడు రైతు చట్టాలు..
అప్పుడు డైయర్లు..
ఇప్పుడు మిశ్రాలు..
అప్పుడు జలియన్ వాలా బాగ్ ..
ఇప్పుడు లఖింపూర్ ఖేరీ
డైరెక్టర్ చరిత్ర చూపిస్తున్నాడు..
నాకు మాత్రం వర్తమానమే కనిపిస్తోంది.


దేశ భక్తి సినిమాలంటే ఏముంటాయి.
అయితే, పాకిస్తానీ విలన్లుంటారు..
లేదా బ్రిటీష్ నరరూప రాక్షసులుంటారు.
పేజీల కొద్దీ డైలాగులు..
అరుపులు కేకలు.
గుండెలు బాదుకునే నినాదాలు..
బ్లాక్ అండ్ వైట్ కేరెక్టరైజేషన్లు..
ఉపన్యాసాలూ, ఉపోద్ఘాతాలూ వుంటాయి.
ఫర్ ఎ ఛేంజ్.. ఉధమ్ సింగ్ అలా లేదు.
కథ క్రైమ్ థ్రిల్లర్ లా మొదలవుతుంది.
ఎక్కడా మెలో డ్రామా వుండదు.
అనవసరమైన సస్పెన్స్ కూడా లేదు.
జలియన్ వాలాబాగ్ కి కారణమైన బ్రిటిష్ అధికారిని (జనరల్ డయ్యర్ ని కాదు) ఉధమ్ సింగ్ చంపేస్తాడు.
ఎలా చంపేస్తాడన్నది ఫస్ట్ ఆఫ్ అంతా నడిచినా..
నిజానికి అది పెద్ద విషయం కాదు..
ఎక్కడో పంజాబ్ లోని ఓ గ్రామంలో్ పుట్టి..
లండన్, రష్యా లు తిరిగి..
అక్కడి సంస్థలతో, ప్రభుత్వాలతో చర్చలు జరిపి..
ఆయుధాలు సమకూర్చుకుని,
సరైన అవకాశం కోసం 21 ఏళ్ళు వేచి చూసి..
ఒక హత్య చేయడంలో ఎన్నో మలుపులున్నాయి.
ఎంతో జీవితం ఉంది..
ఎన్నో రాజకీయాలున్నాయి.
కానీ అవన్నీ కూడా దర్శకుడికి.. ఈ సినిమాకు అంత ముఖ్యం కాదు.
ఏదో కాస్త ఆవేశం తప్ప, ఏనాడూ ఏ నేరం చేయడని వాడు..
అన్నేళ్ళు ఆ కసిని ఎందుకు నిలబెట్టుకున్నాడు.
అంతగా వేటాడి వెంటాడి ఆ వ్యక్తినే ఎందుకు చంపాడు..
అది ప్రతీకారంగా కాక.. కేవలం ఒక ప్రతిఘటన రూపంగా ఎలా చూసాడు..?
షేర్ షా ని ఉధమ్ సింగ్ గా మార్చిన పరిస్థితులేంటి..


ఇదంతా చెప్పడానికి ఒక్క జలియన్ వాలా బాగ్ ఘటన చాలు..
అందుకే ఆ ఘటనని అత్యంత సమర్ధంగా వాడుకున్నాడు.
కాస్త నిడివి ఎక్కువైనా.. అదే సినిమాకి ప్రాణం.
అంతకు మించి నాటకీయతేం లేదు.
ఓ పాతికేళ్ళ కుర్రాడు ఎలా వుంటాడో ఉధమ్ సింగ్ అలాగేవుంటాడు.
కోపం వస్తే తిరగబడతాడు…
మనసు బాధపడితే.. మందుకొడతాడు.
బ్రిటిష్ వాళ్ళకి కూడా వాళ్లదైన వాదనుంటుంది.
ఇండియాని పాలించడం వాళ్ళ బాధ్యత అనుకుంటారు..
1857 తిరుగుబాటు వాళ్లని వెంటాడుతూ వుంటుంది.
ఆ భయమే జలియన్ వాలాబాగ్ లాంటి దారుణానికి కారణమవుతుంది.
రెండువైపుల కేరెక్టర్ల నీ నేల మీద నిలబెట్టి..
చెప్పాల్సినదాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పడమే ఈ సినిమా..
ఆఖరికి భగత్ సింగ్ కూడా ఇంక్విలాబ్ అని పెడబొబ్బలేం పెట్టడు..
తీవ్రమైన తిరుగుబాటుతత్వం మనసులో వున్నా..
తుళ్లుతూ గెంతుతూ తిరిగే కుర్రాళ్ళుగా భగత్ సింగ్, ఉధమ్ సింగ్ లు గుర్తుండిపోతారు.

దేశంలో అధికారపీఠాన్ని బెంగాల్.. పంజాబ్ లు చికాకు పెడుతున్న ప్రస్తుత నేపథ్యంలో
ఓ పంజాబి వీరుడి కథ.. మరో బెంగాలీ దర్శకుడు తెరకెక్కించడం యాదృ చ్ఛికమే..
కమ్యూనిస్టులంతా దేశద్రోహులే అని సూత్రీకరిస్తున్న వర్తమానంలో
ఒక కమ్యూనిస్టు దేశభక్తుడిగా సర్దార్ ఉధమ్ సింగ్ తెరకెక్కడం ఆసక్తికరమే..
వైవిధ్యాన్ని, లౌకికతని హేళన చేసే సమూహాలు రాజ్యమేలుతున్న కాలంలో..
మహమ్మద్ సింగ్ ఆజాద్.. అని మారుపేరు పెట్టుకున్న ఉధమ్ సింగ్ హీరోగా కనపడడం అవసరమే…
– శివ

RELATED ARTICLES

Most Popular

న్యూస్