చంద్రబాబు కుట్రల వల్లే పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే కొన్ని సాంకేతిక అంశాలను పట్టుకొని కోర్టులకు వెళ్ళారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశయిస్తామని సజ్జల వెల్లడించారు. నేషనల్ బిల్డింగ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారమే తాము సెంటు, సెంటున్నర స్థలంగా నిర్ణయించామని చెప్పారు. పేదలకు సొంతింటి కల సాకారం అయ్యే సమయంలో ఈ కుట్ర చేశారని, ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని సజ్జల విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు ఇప్పటికైనా మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామని, వీటిలో 15 లక్షల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే మొదలైందని సజ్జల చెప్పారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేనివారు ఏ ఒక్కరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే సిఎం జగన్ గృహ నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారని చెప్పారు. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, బస్టాప్ లు, ఎలక్ట్రానిక్ లైబ్రరీ లాంటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని వివరించారు. టిడిపి చేస్తున్న కుట్రలు ప్రజలు గమనించాలని, మేధావులు ఖండించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు.
బద్వేల్ లో టిడిపి ఎందుకు పోటీ చేయడంలేదో అర్ధం కాలేదని, దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధను అభ్యర్ధిగా ఎప్పుడో ప్రకటించమని సజ్జల గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా పోటీ విరమించుకొని బిజెపికి మద్దతు ఇస్తున్నారని, బిజెపి కేవలం మత ప్రాతిపదికపైనే బరిలో ఉందని సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నయంటూ బిజెపి నేతలు మాట్లాడడం సరికాదన్నారు. సిఎం జగన్ ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలి కానీ, ఎప్పుడూ అప్పులు, మతం చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారని సజ్జల మండిపడ్డారు.