రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ‘ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది’ అంటూ అయన వ్యాఖ్యానించారు. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలను బాదుతున్నారని, మరోవైపు విద్యుత్ కోతలతో అంధకారంలో ముంచుతున్నారని మండిపడ్డారు.
బొగ్గు కొరత ఏర్పడబోతోందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం 40 రోజుల ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని లోకేష్ దుయ్యబట్టారు. సొంత మీడియాకి 200 కోట్ల రూపాయలకు పైగా ప్రకటనల రూపంలో దోచిపెట్టిన ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని మాత్రం చెల్లించకపోవడం దారుణమన్నారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టినందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.