హంద్రీ నీవా నుంచి జిల్లాల్లోని కాలువలకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై హిందూపురంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మత్లాడుతూ సీమ జిల్లాలోని కాల్వలకు వెంటనే నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువుతో అల్లాడే సీమకు సాగునీరు, తాగునీరు అందించేందుకు హంద్రీనీవా ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాయల సీమకు నికర జలాలు అందించాలని, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం జరగాలని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సీమ సాగునీటి హక్కుల కోసం అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమం చేద్దామని అయన పిలుపు ఇచ్చారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి రంగ నిపుణులతో పాటు టిడిపి సీనియర్ నేతలు కాల్వ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్ప, పార్థసారథి, అమర్ నాథ్ రెడ్డి, కేఈ ప్రభాకర్, పరిటాల శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. కృష్ణాజలాల నీటి కేటాయింపులు, హంద్రీనీవా కాల్వలు, పెండింగ్ ప్రాజెక్ట్ లు, రైతు సమస్యలపై ఈ సదస్సులో సమగ్రంగా చర్చించారు. సీమ జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో నేతలు, రైతులు, టిడిపి కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.