ఐసీసీ టి-20 పురుషుల వరల్డ్ కప్ లో శ్రీలంక వరుసగా రెండో విజయంతో సూపర్ 12 కు చేరుకుంది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై 70 పరుగులతో ఘనవిజయం సాధించింది. 47 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 71 పరుగులతో పాటు ఒక వికెట్ కూడా తీసిన శ్రీలంక ఆటగాడు హసరంగకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే శ్రీలంక రెండు ఓవర్లలో ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ నిశాంకకు హసరంగ జతకలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిశాంక 47 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్ తో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ షనక కేవలం 11 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 21 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగలిగింది. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్ నాలుగు, మార్క్ అడైర్ రెండు, పాల్ స్టిర్లింగ్ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ వికెట్ల పతనం మొదటి ఓవర్ నుంచే మొదలైంది. కెప్టెన్ ఆండ్రూ-41, కర్టిస్ క్యాంపర్-24 మినగా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఐర్లాండ్ 18.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మహీష తీక్షణ మూడు; లాహిరు కుమార, కరునరత్నే చెరో రెండు; చమీర, హసరంగా చెరో వికెట్ పడగొట్టారు.